వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో కోదండరామ్ తేడాలు: అసలుకే ఎసరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

KCR - Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ జెఎసి మధ్య విభేదాలు మరింత ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు మధ్య విభేదాలు తెలంగాణ ఉద్యమానికే ఎసరు పెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని శక్తులు తెలంగాణ కోసం ఏం చేద్దామంటూ, తెలంగాణ ఎట్లొస్తదంటూ చర్చా కార్యక్రమాలకు తెర తీసినట్లు భావిస్తున్నారు. తాజాగా తెరాస నాయకుడు వినోద్ చేసిన వ్యాఖ్యలు తెరాసకు, తెలంగాణ జెఎసికి మధ్య పెరిగిన విభేదాలను పట్టి చూపిస్తోందని అంటున్నారు

తెలంగాణ జెఎసికి మద్దతు ఇవ్వాలో వద్దో తమ పార్టీ పొలిట్‌బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వినోద్ అన్నారు. తమ పంథా వేరు, తెలంగాణ జెఎసి పంథా వేరు అని ఆయన అన్నారు. అంతకన్నా ముందు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా విభేదాలున్న విషయాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు. కోదండరామ్‌ను కలిసేంత పెద్దవాడిని కానని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కట్టుబడినవారంతా కలిసికట్టుగానే ఉన్నారని కోదండరామ్ ఇటీవల అన్నారు. కెసిఆర్ ప్రకటన నేపథ్యంలోనే ఆయన ఆ ప్రకటన చేశారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కెసిఆర్, కోదండరామ్ కలిసిన సంఘటనలు కూడా పెద్దగా లేవని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తుందనే సంకేతాలు తనకు ఉన్నాయని కెసిఆర్ అన్న మాటలను కోదండరామ్ వ్యంగ్యంగా వ్యతిరేకించారు. ఆయనకేమైనా సమాచారం తెలిసిందేమో, తనకైతే తెలియదని కోదండరామ్ అన్నారు.

మిలియన్ మార్చ్ సందర్భంలోనే ఇరువురి మధ్య విభేదాలు పొడసూపినట్లు చెబుతారు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నిక ఫలితం అగ్నికి ఆజ్యం పోసిందని అంటున్నారు. మహబూబ్‌నగర్ శాసనసభా నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గెలవడం వెనక కోదండరామ్ పరోక్ష హస్తం ఉందనే భావన తెరాస వర్గాల్లో ఉంది. తెరాసను బలపరుస్తున్నట్లు మొదటి నుంచీ కోదండరామ్ చెప్పి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని అంటున్నారు. అయితే, ఆ కోపాన్ని దిగమింగి పరకాల ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు కెసిఆర్ వేచి చూశారని అంటున్నారు.

తమకూ తెరాసకు మధ్య ఏ విధమైన విభేదాలు లేవని చెప్పినప్పటికీ, ఇప్పటి నుంచే తెలంగాణ జెఎసిని నియంత్రించకపోతే భవిష్యత్తులో ఏకు మేకవుతుందని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పదవీ విరమణ చేసిన స్వామి గౌడ్‌ను కోదండరామ్ స్థానంలో నిలిపేందుకు కెసిఆర్ తగిన భూమికను తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. జెఎసి గొడుగు కింద ఉన్న పలు సంఘాలను తెరాస అనుబంధ సంఘాలుగా ముందుకు తెచ్చేందుకు తగిన వ్యూహరచన చేసి కెసిఆర్ అమలు చేస్తున్నారని అంటున్నారు. బొగ్గు గని కార్మికులు, ఆర్టీసి కార్మికుల విషయంలో ఆ పని ఇది వరకే జరిగిపోయిందని కూడా చెబుతున్నారు. మొత్తం మీద, కెసిఆర్‌కూ కోదండరామ్‌కూ మధ్య ఏర్పడిన గండి పూడ్చలేనంతగా తయారైందని అంటున్నారు.

కాగా, తెరాసకు, తెలంగాణ జెఎసికి మధ్య మనస్పర్థలు లేవని కోదండరామ్ బుధవారం చెప్పారు. తెరాస, బిజెపిలు తెలంగాణ జెఎసిలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. అన్ని సంఘాలను కలుపుకుని తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జెఎసి కార్యాచరణ లక్ష్య సాధన దిశగా ఉంటుందని ఆయన చెప్పారు.

English summary
It is said that rift between Tealangana Rastra Samithi president K Chandrasekhar Rao and Telangana JAC chairman Kodandaram is widening. But Kodandaram is condemning the reports on rift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X