వైయస్‌ను తలుచుకుని కన్నీరు పెట్టిన విజయమ్మ

వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రీయంబర్స్‌మెంట్ వందల కోట్లలో ఉండేదని, ఇప్పుడు వేల కోట్లకు పెరిగిందని, వైయస్ రాజశేఖర రెడ్డి ఉండేవుంటే పునరాలోచన చేసి ఉండేవారని అంటున్నారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎట్టి పరిస్థితిలోనూ ఆపి ఉండేవారు కాదని, వైయస్ మనసు అలాంటిది కాదని, వైయస్ మనసు చాలా పెద్దది అని ఆమె అన్నారు. మనసు ఉండాలని, విశ్వసనీయత ఉండాలని ఆమె అన్నారు. మంత్రుల కమిటీ భారాన్ని ఎలా తగ్గించుకోవాలని చూస్తోందని ఆమె అన్నారు.
వైయస్ రెక్కల కష్టం మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందని, అలాంటి ప్రభుత్వం వైయస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ఆమె అన్నారు. వైయస్ వెళ్లిపోయి సెప్టెంబర్ 2వ తేదీ వస్తే మూడేళ్లు అవుతోందని, ఈ ప్రభుత్వాన్ని చూస్తే తనకు బాధేస్తోందని ఆమె అన్నారు. పైనుంచి చూస్తూ వైయస్ కూడా బాధపడుతున్నారేమోనని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుంటూ ఆమె కన్నీరు పెట్టారు. వైయస్ ఆశించింది ఇదేనా అని అనిపిస్తోందని ఆమె అన్నారు.
వైయస్ వెళ్లిపోయిన తర్వాత తనయుడు వైయస్ జగన్ వచ్చారని, నెలకు 25 రోజులు ప్రజల మధ్యనే ఉన్నాడని, ప్రతి సమస్యలోనూ స్పందిస్తూ ఉన్నారని, జైల్లో పెట్టారని, ఉండి ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవారని ఆమె అన్నారు. విద్యార్థుల కోసం మనం చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం నిద్రపోతోందని చెప్పి తనను పంపించారని ఆమె అన్నారు. హైదరాబాదులో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై వారం రోజులు దీక్ష చేశాడని, వారం రోజులు ఏమీ తినకుండా ఉంటే తన మనసుకు కష్టమేసిందని, ప్రజల కోసం ఏమీ తినకుండా ఉంటే ఏమీ కాదులే అమ్మా అని అన్నారని ఆమె వివరించారు. ఈ సమయంలో కూడా ఆమె కన్నీళ్లు పెట్టారు.
వైయస్ జగన్ అమ్మఒడిని పార్టీ ప్లీనరీలోనే ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. విద్యార్థుల స్థాయిని బట్టి చెల్లించే సొమ్మును కూడా జగన్ చెప్పాడని ఆమె అన్నారు. విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పించడాన్ని బాధ్యతగా, సవాల్‌గా తీసుకుంటానని చెప్పారని ఆమె అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని తాను పెట్టానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారని, వైయస్ సంక్షేమ పథకాలను చంద్రబాబు తప్పు పట్టారని, ఎప్పుడైనా విద్యార్థుల వద్దకు వచ్చాడా అని ఆమె అన్నారు. ఇప్పుడు విద్యార్థుల చుట్టూ తిరుగుతున్నారని ఆమె అన్నారు.
ఈ పథకాల సలహాలు వైయస్‌కు తామే చెప్పామని కాంగ్రెసు నాయకులు అంటున్నారని, వైయస్ ఒక్కరే కదా ఇవాళ లేనిది, మిగతా వారంతా ఉన్నారు కదా, పథకాలు అమలు చేయడానికి ఏం ఆటంకాలు ఉన్నాయని ఆమె అన్నారు. వైయస్ ఫొటో తీసేయాలని, వైయస్ పథకాల పేర్లు మార్చాలని చూస్తున్నారని ఆమె అన్నారు. వైయస్ ఫొటో లేకపోయినా ప్రజల మనస్సుల్లో ఉన్నారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఆమె వివరించారు. వైయస్ జగన్ తప్పకుండా బయటకు వస్తారని, జగన్ అధికారంలోకి వస్తారని, వైయస్ పథకాలను అన్నింటినీ అమలు చేస్తారని ఆమె అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ సొమ్మును బడ్జెట్ కేటాయింపులు జరిపితే ఇబ్బంది ఉండదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications