సిఎంపై ఫైర్: వైయస్ జగన్ లాగా కాదన్న విహెచ్

ధర్మాన ప్రసాద రావు వ్యవహారాన్ని అధిష్టానానికి నివేదించినట్లు చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఏ అధిష్టానానికి చెప్పి పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగించారని ఆయన ప్రశ్నించారు. ధర్మాన వ్యవహారాన్ని అధిష్టానానికి నివేదించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. చెడు జరిగితే అధిష్టానం ఖాతాలోకి, మంచి జరిగితే తన ఖాతాలోకా అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలవారికి భద్రత కల్పించాలని తాను గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.
ఇందిరమ్మ బాట గురించి ముఖ్యమంత్రి అధిష్టానానికి చెప్పారా అని ఆయన అడిగారు. ధర్మాన ప్రసాద రావు నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశారని, ఆమోదింపజేసుకోవడానికే ధర్మాన రాజీనామా చేశారని ఆయన అన్నారు. ప్రతిదానికీ అధిష్టానం మీద ముఖ్యమంత్రి ఆధారపడడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేసిందే తామేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ లాగా తండ్రి పదవులను అడ్డం పెట్టుకుని తాము నాయకులం కాలేదని ఆయన అన్నారు.
ధర్మాన వ్యవహారాన్ని నాన్చడంపై మాజీ మంత్రి పి. శంకరరావు మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ నిందితుడిగా చేర్చిన తర్వాత కూడా ధర్మానను మంత్రి పదవి నుంచి గవర్నర్ నరసింహన్ ఎందుకు తొలగించడం లేదని ఆయన అడిగారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తనను మంత్రి పదవి నుంచి తొలగించారని, నిందితుడిగా చార్జిషీట్‌లో పేరున్న ధర్మానను మాత్రం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. కేబినెట్ నిర్ణయాలనే అమలు చేశామంటున్న మంత్రులందరినీ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.