ఎన్డీటీవీ సర్వే: జగన్‌దే హవా, తెలంగాణలో కెసిఆర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని 17 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని 11 శాతం మంది, చిరంజీవిని 6 శాతం మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తేలింది. ఆశ్చర్యకరంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును 17 శాతం మంది ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తేలింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైయస్ జగన్ స్వీప్ చేస్తారని సర్వేలో తేలగా తెలంగాణలో కెసిఆర్ హవా కొనసాగుతుందని వెల్లడైంది. తెలంగాణలో జగన్‌ను ముఖ్యమంత్రిగా 19 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 43 శాతం మంది కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. సీమాంధ్రలో 4 శాతం మంది కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు సర్వేలోతేలింది.
ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంటుందని సర్వేలో తేలింది. తెలుగుదేశం పార్టీ కన్నా కాంగ్రెసు పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉంది. లోకసభ సీట్లలో 21 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, 10 సీట్లు తెరాస, 9 సీట్లు కాంగ్రెసుకు వస్తాయని సర్వేలో తేలింది. ఇతరులు రెండు సీట్లు గెలుస్తారని సర్వేలో తేలింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఈ ప్రాంతంలో 86 శాతం మంది చెప్పగా, తెలంగాణేతర ప్రాంత ప్రజల్లో 24 శాతం మంది తెలంగాణకు అనుకూలంగా ఓటేశారు. వైయస్ జగన్‌పై కేసులు న్యాయసమ్మతమేనని తెలంగాణలో 74 శాతం మంది అభిప్రాయపడగా, తెలంగాణేతర ప్రాంతంలో 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్‌పై కేసులు పెట్టారని తెలంగాణలో 26 శాతం మంది, సీమాంధ్రలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అవినీతి ఎన్నికల అంశం కాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అన్ని పార్టీలు అవినీతిమయమేనని చెప్పారు. కాంగ్రెసు ఎక్కువ అవినీతికరమైన పార్టీ అని 54 శాతం మంది అభిప్రాయపడగా, బిజెపి అత్యంత అవినీతికరమైన పార్టీ అని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజస్థాన్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్టాల్లో కాంగ్రెసు అవినీతికి ఎక్కువగా పాల్పడిందని చెప్పగా, కర్ణాటకలో బిజెపి అత్యంత ఎక్కువ అవినీతికి పాల్పడిన పార్టీ అని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications