పోలవరంపై కిరణ్‌కు షాక్: ఒడిషాలో భారీ ర్యాలీ

ఈ ర్యాలీని నిర్వహించడంలో ఒడిషా పాఠశాల విద్యామంత్రి రబీ నారాయణ నందా ప్రముఖ పాత్ర పోషించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను ఖరారు చేశామని, త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఆంధ్ర - ఒడిషా సరిహద్దులోని మోటు ప్రాంతంలోని సాగు భూములు, గిరిజన తండాలు పెద్ద యెత్తున ప్రాజెక్టు వల్ల మునకకు గురవుతాయని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టు అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందని నందా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం సహకరిస్తోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును ఆపకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకు సాగు నీరు అందడమే కాకుండా పట్టణాలకు, గ్రామాలకు మంచినీరు కూడా అందిస్తుంది. జల విద్యుదుత్పాదక ప్రాజెక్టు కూడా ప్రతిపాదనల్లో ఉంది. వందలాది గిరిజన గ్రామాలు మునకకు గురవుతాయనే ఉద్దేశంతో ఒడిషా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి.












Click it and Unblock the Notifications