తెలంగాణ: కిషన్, కెసిఆర్.. ఢిల్లీ బాట పడుతున్ననేతలు

సత్యాగ్రహ పేరుతో సోమవారం నుండి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షను చేపట్టారు. ఈ దీక్షను బిజెపి సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. కాంగ్రెసు తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడితే దానిని పాస్ చేయించే బాధ్యత మా పార్టీదని చెప్పారు. రాజ్ నాథ్ సింగ్ కూడా కాంగ్రెసు తెలంగాణ విషయంలో మోసం చేసిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. కిషన్ రెడ్డి దీక్షకు టిజెఏసి చైర్మన్ కోదండరామ్ సంఘీభావం తెలిపారు.
కిషన్ రెడ్డి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఈ నెల 5న ఢిల్లీ బాట పట్టనున్నారు. కాంగ్రెసు పెద్దల ఆహ్వానం మేరకే అతను ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కూడా కెసిఆర్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నారు. తమ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవిని కెసిఆర్ కలిసే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చే సమయానికి కెసిఆర్‌తో పార్టీ పెద్దలు చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారని, ఆమె వచ్చాక ఓ ప్రకటన వెలువడే అవకాశముందని వారు భావిస్తున్నారు. మరోవైపు తెరాస నేతలు మాత్రం పార్లమెంటు సమావేశాల కోసమే కెసిఆర్ ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నారు.
బిజెపి, టిఆర్ఎస్ ఢిల్లీ బాట పడుతుండగా... రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణకు అనుకూలంగా పార్టీ తరఫున కేంద్రానికి మరోసారి లేఖ ఇచ్చేందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా తెలంగాణపై సెప్టెంబర్ రెండోవారంలో ఓ నిర్ణయాన్ని వెలువరుస్తానని చెప్పారు. ఆ నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా ఉండాలని టిటిడిపి నేతలు అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. తెలంగాణ కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లాలని కూడా టిటిడిపి నేతలు భావిస్తున్నారట.
తెలంగాణ ప్రజా సంఘాల కమిటీ ఆదివారం చంద్రబాబును కలిసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆ తర్వాత గజ్జెల కాంతం చెప్పారు. బాబు కేంద్రానికి సానుకూలంగా లేఖ రాస్తే అప్పుడు కాంగ్రెసు చిక్కుల్లో పడటం ఖాయం. కాగా ఢిల్లీ వెళ్లనున్న కెసిఆర్ కేవలం కాంగ్రెసు నేతలతో మాత్రమే కాకుండా యుపిఏ మద్దతు పార్టీలతో కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. కెసిఆర్ కాంగ్రెసు నుండి సెప్టెంబర్ 10వ తేదీలోగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని ఆశాభావంతో ఉన్నారట.












Click it and Unblock the Notifications