సోనియా ఇస్తామన్నారు, బాబును కలువలేదు: గుత్తా

సోనియా మాటలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టే తాము పార్లమెంటును అడ్డుకోలేదని ఆయన చెప్పారు. తాము మౌనంగా ఉన్నప్పటికీ సీమాంధ్ర నేతలు సమైక్య ప్రకటన చేయాలని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరడం సమంజసం కాదని ఆయన అన్నారు. తాము చంద్రబాబుతో చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు.
తెలుగుదేశం నేతల బృందం పార్లమెంటులో ఎదురైందని, చంద్రబాబు ప్రతిపక్ష నేత అన్న గౌరవంతో ఎదురెళ్ళి మాట్లాడాముని ఆయన అన్నారు. దాంతో పార్లమెంటు సెంట్రల్ హాల్లో చంద్రబాబును కలుసుకుని చర్చించినట్లుగా వార్తలొచ్చాయని, అవి అవాస్తవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. పత్రికలు అనుమానాలు కలిగేలా వ్యాఖ్యానాలు చేయడం సరికాదని అన్నారు. తెలంగాణా ప్రాంత ఎంపీలు మౌనంగా లేరని, తెలంగాణా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని వెల్లడించారు.
పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణా ఎంపీలు మౌనంగా ఉంటున్నారని పలువురు పేర్కొంటున్నారని, కానీ సమావేశాల మొదటి రోజునే తాము ధర్నా చేశామని గుర్తు చేశారు. తెలంగాణా కోసం పార్లమెంటును అడ్డుకోవద్దంటూ సోనియాగాంధీ విఙ్ఞప్తి చేశారని తెలిపారు. వైయస్ పాదయాత్రపై కేవీపీ రాంచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి తనకు కూడా ఆహ్వానం అందిందని, అయితే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications