• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బాబు తర్వాత ఎవరో తేలింది!: వ్యూహాత్మకంగా లోకేష్

By Srinivas
|

Balakrishna-Jr Ntr-Nara lokesh
హైదరాబాద్: పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయో ఇప్పుడు తేలిపోయిందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆరో లేక మరో కారణంగానో టిడిపి పగ్గాలు బాబు తర్వాత ఎవరి చేతిలోకి వెళతాయనే అంశంపై ఇన్నాళ్లూ సంశయం ఉండేది. నారా లోకేష్ చేతికే టిడిపి పగ్గాలు కట్టబెట్టేందుకు బాబు ఆసక్తి చూపిస్తారనే అంశం తెలిసిందే అయినప్పటికీ జూ.ఎన్టీఆర్ వివాదం, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అసంతృప్తి కారణంగా ఏమైనా జరగవచ్చుననే మీమాంస ఉండేది.

అంతేకాకుండా నందమూరి అభిమానులతో పాటు కొంతమంది తెలుగు తమ్ముళ్లు, టిడిపి అభిమానులు పలువురు హీరో బాలకృష్ణను ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికను తరుచూ వెళుబుచ్చుతున్నారు. దీంతో పగ్గాలు లోకేష్ చేతికి కాకుండా ఇతరుల చేతిలోకి వెళ్లే అవకాశాలు లేవని కొట్టి పారేయలేని పరిస్థితి ఉండేది. అయితే బుధవారం లోకేష్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ ఆరంగేట్రాన్ని తేల్చేశాయి.

మొదటిసారి రాజకీయాలపై మాట్లాడిన లోకేష్ ఇతర పార్టీలపై విమర్శలు చేయనప్పటికీ ఘాటుగానే మాట్లాడారని చెప్పవచ్చు. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురించి ప్రశ్నించినప్పుడు తాను ఇతర రాజకీయ పార్టీల గురించి మాట్లాడనని చెబుతూనే.. రాష్ట్రంలో కాంగ్రెసును ఎదుర్కోగల్గిన పార్టీ కేవలం టిడిపియేనని, ఇతర పార్టీలో కాంగ్రెసులో విలీనం కావడం ఖాయమని చెప్పారు.

రాజకీయాలపై తొలిసారి మాట్లాడినప్పటికీ లోకేష్ వ్యూహాత్మకంగా మాట్లాడటం గమనార్హం. పార్టీలో తన బాధ్యతల పైన కూడా ఆచితూచి స్పందించారు. పార్టీలో ఏ పదవి చేపడతారని ప్రశ్నించగా.. తాను పార్టీలో సాధారణ కార్యకర్తలాగానే కొనసాగుతానని చెప్పారు. లోకేష్ అలా చెప్పినప్పటికీ త్వరలో పార్టీలో ఆయనకు ఏదో ప్రాధాన్యత కల్గిన బాధ్యత అప్పగించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే పార్టీలో ఆయనతో పాటు బాలకృష్ణకు అప్పగించాల్సిన బాధ్యతలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

లోకేష్‌ను పార్టీ ప్రధాన కార్యదర్సిగా, బాలకృష్ణను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారనే ఊహాగానాలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. లోకేష్‌కు ప్రస్తుతానికి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించి భవిష్యత్తు నేతగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. సొంత అల్లుడు కాబట్టి బాలయ్యకు కూడా పెద్దగా అభ్యంతరాలు ఏమీ ఉండవు. లోకేష్ వ్యాపారాలు చూసుకుంటున్నారని, రాజకీయాలు ఇప్పుడే కాదని చంద్రబాబు చెప్పినప్పటికీ అతని ఆదేశాలు లేకుండా లోకేష్ బహిరంగంగా రాజకీయాలు మాట్లాడే అవకాశాలు లేవు.

ఈరోజు లోకేష్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు వ్యూహం ఉందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు వెనక్కి వెళ్లడంతో చంద్రబాబు తన తనయుడు లోకేష్‌ను క్రమంగా తెర పైకి తీసుకు వచ్చారని అంటున్నారు. బాబు తర్వాత బాధ్యతలు ఎవరికి అనే విషయమై నాలుగు నెలల క్రితం జోరుగా చర్చ జరిగింది. అయితే అప్పుడు తెలుగు తమ్ముళ్లు బాబు మరో పది పదిహేనేళ్లు పార్టీని నడిపిస్తారని, ఇప్పుడే దానిని ఆలోచించడం అనవసరమని చెప్పారు.

కానీ పదేళ్ల తర్వాత పార్టీని నడిపించాలన్నా ఇప్పటి నుండి ఎవరినో ఒకరిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లేదంటే జూ.ఎన్టీఆర్ వివాదంలా మరో వివాదం రాదని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇప్పటి నుండే భవిష్యత్తులో బాధ్యతలు స్వీకరించాల్సిన వ్యక్తిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే బాబు తనయుడు వ్యాపారాల్లో బిజీగా ఉన్నప్పటికీ తెరపైకి తీసుకు వచ్చి ఉంటారని అంటున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం బాబు తర్వాత బాధ్యతలు ఎవరికనే అంశంపై మాట్లాడేందుకు ఆసక్తి చూపించటం లేదంటున్నారు.

English summary
It is said that Nara Lokesh Kumar will take up party responsibilities after Telugudesam Party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X