ఢిల్లీలో కెసిఆర్: విలీనంపై కాంగ్రెసు పెద్దలతో చర్చలు

కాగా, కెసిఆర్ కాంగ్రెసులో తెరాస విలీనంపైనే కాంగ్రెసు పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆయన అందుకు షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సెప్టెంబర్ 30వ తేదీలోగా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు ఆ మీడియా కథనాల సారాంశం. తెరాస మద్దతుతో తెలంగాణలో తిరిగి బలాన్ని పుంజుకోవాలని ఆశిస్తున్న కాంగ్రెసు పెద్దలు కెసిఆర్‌ను బుజ్జగిస్తున్నట్లు చెబుతున్నారు.
విలీనం ప్రతిపాదనపై మాట్లాడేందుకు కెసిఆర్ సోనియా గాంధీని కలవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా కాంగ్రెసుతో తాము చర్చలు జరుపుతున్నామని, విలీనం ప్రతిపాదనతో సీనియర్ కాంగ్రెసు నాయకుడొకరు తన తండ్రి కెసిఆర్‌ను కలిశారని కల్వకుంట్ల కవిత ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో అన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ బాధ్యత తీరినట్లేనని, హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తెరాసను కాంగ్రెసులో విలీనం చేయడానికి అభ్యంతరం లేదని కూడా ఆమె అన్నారు. అదే విషయాన్ని కెసిఆర్ చెబుతున్నట్లు ఆమె తెలిపారు.
తాము హామీలను నమ్మబోమని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలని ఆమె అంటున్నారు. తెలంగాణ జెఎసి సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై కాంగ్రెసు పెద్దలు తీవ్రంగానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మార్చ్‌కు తెరాస అధికారిక మద్దతు తెలుపలేదు. కానీ కాంగ్రెసు దిగిరాకపోతే దాన్ని బలపరచాల్సిన అవసరం తెరాసకు ఉంటుంది. మూడు వారాల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో మూడు రోజుల పాటు ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు పరిస్థితి తెలంగాణ మార్చ్ ఎలా ఉంటుందనే విషయంపై ఆందోళన నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications