పొన్నాల రాయబారం: దిగొచ్చిన తెరాస ఎమ్మెల్యేలు

ప్రభుత్వం తెరాస శాసనసభ్యుల ఆవేదనను అర్థం చేసుకుందని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. రైతులకు ఏడు గంటలు విద్యుత్తు అందించాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ప్రాధాన్యం ఇచ్చి పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఆ విషయాన్ని తాను తెరాస శాసనసభ్యులకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
తెరాస శాసనసభ్యులు ప్రజల పక్షాన నిలబడి తమ నిబద్ధతను చాటుకున్నారనే విషయాన్ని తాము గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, వర్షాలు లేకపోవడంతో జలాశయాలు నిండలేదని, దాంతో జలవిద్యుదుత్పత్తి విపరీతంగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కూడా తగ్గిపోయిందని ఆయన అన్నారు. దీంతో విద్యుత్తు సమస్య ఎదురవుతోందని ఆయన అన్నారు.
రైతులకు విద్యుత్తును అందించడంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. వినియోగదారులకు మేలు చేయాలనడంలో రెండో మాట లేదని, అందులోనూ వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్తుపై ప్రతి రోజూ సమీక్ష జరిపి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. విద్యుత్తు సమస్య ఈసారి ప్రకృతి వైపరీత్యంలా వచ్చిందని, మునుపెన్నడూ ఈ విధమైన సమస్య రాలేదని ఆయన అన్నారు. పొన్నాల లక్ష్మయ్య హామీతో తెరాస ఎమ్మెల్యేలు ధర్నా విరమించారు.












Click it and Unblock the Notifications