సమైక్యానికి ఢిల్లీ యాత్ర: శైలజానాథ్, జెసి డుమ్మా

Posted By:
Subscribe to Oneindia Telugu
Sailajanth
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యతపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానాన్ని కోరడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరున గానీ, వచ్చే నెలారంభంలో గానీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఈ విషయంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి శైలజానాథ్ చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దల అపాయింట్‌మెంట్ ఖరారు చేయాలని పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావును కోరాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు శైలజానాథ్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మిగతా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్టాన్ని సమైక్యంగా ఉంచేందుకు అందరం కృషి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

సీమాంధ్ర నేతల్లో విభేదాలు లేవని ఆయన చెప్పారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఆయన నిర్వాహకులను కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాల్లో బస్సు యాత్రలు చేయాలని ప్రతిపాదన సమావేశంలో వచ్చింది. అయితే, ఆ ప్రతిపాదనను కొంత మంది నాయకులు వ్యతిరేకించారు. దానివల్ల తెలంగాణవాదులను రెచ్చగొట్టినట్లు అవుతుందని, అటువంటి పరిస్థితి తేకూడదని, సంయమనం పాటిస్తూ సమైక్యానికి అనుకూలంగా కేంద్రం ప్రకటన చేసేలా అధిష్టానాన్ని ఒప్పించాలని అనుకున్నారు.

సమావేశానికి టిజి వెంకటేష్, కొండ్రు మురళి, గంటా శ్రీనివాస రావులతో పాటు ఆరుగురు మంత్రులు హాజరయ్యారు. 24 మంది శాసనసభ్యులు, ఏడుగురు ఎమ్మెల్సీలు సమావేశానికి వచ్చారు. రాయలసీమకు చెందిన జెసి దివాకర్ రెడ్డి, మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి సమావేశానికి రాలేదని తెలుస్తోంది. తాము సమావేశానికి హాజరు కావడం లేదని, ఏరాసు ప్రతాప రెడ్డి కూడా వెళ్లడం లేదని సమావేశానికి ముందే జెసి దివాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇటువంటి సమావేశాల వల్ల ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌కు వచ్చి సమావేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister from Rayalaseema Sailajanath said that Seemandhra leaders will put efforts to oppose bifurcation of Andhra Pradesh. Seemandhra minister, MLAs and MLCs met today to chalk out future coarse of action.
Please Wait while comments are loading...