మార్చ్‌ను వాయిదా వేయించండి: తెరాస నేతలతో సిఎం

"29న గణేశ్ నిమజ్జనం ఉంది. తెలంగాణ మార్చ్ కూడా ట్యాంక్‌బండ్ వద్దే అంటున్నారు. ఆ సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో జీవ వైవిధ్య సదస్సు జరుగనున్నందున అనుకోని ఘటనలు చోటు చేసుకుంటే.. అది రాష్ట్రానికి మాయని మచ్చగా మిగులుతుంది. మార్చ్‌ను వాయిదా వేసుకోవాలి'' అని ముఖ్యమంత్రి ఆయనను కోరారు. వాయిదా సాధ్యం కాకపోవచ్చునని కిషన్ రెడ్డి తెలిపారు. "అయినా దీనిపై నేనొక్కడినే నిర్ణయం తీసుకోలేను. పార్టీలో చర్చించాకే ఏ విషయమైనా చెబుతాను'' అని స్పష్టం చేశారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే తెరాస ఎమ్మెల్యేలు సీఎం చాంబర్‌కు వచ్చారు. ముందుగా రామగుండం నీటి సమస్య, సీఎం సహాయ నిధి తదితర సమస్యలపై వారు సీఎంతో మాట్లాడారు. అనంతరం జీవ వైవిధ్య సదస్సుకు విఘాతం కలిగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు జరిగే నష్టం గురించి కిరణ్ వారికి వివరించారు. అప్పుడు హరీశ్ రావు జోక్యం చేసుకుని - తెలంగాణ తీర్మానం ప్రవేశ పెడితే ఈ సమస్యకు చాలా వరకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఈ అంశంలో నిట్టనిలువునా చీలినందున తీర్మానం ప్రవేశ పెట్టినా వీగిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. పార్టీలే తమ అభిప్రాయాన్ని వెల్లడించడం మేలని ఆయన చెప్పారు.
మార్చ్ కార్యక్రమాలు ఇప్పటికే చాలా ముందుకు సాగినందున, వాయిదా సాధ్యం కాదని తెరాస శాసనసభ్యులు స్పష్టం చేశారు. మార్చ్‌కు అనుమతి ఇస్తే నష్టమేమీ లేదని వారు అన్నారు. అనుమతి కష్టమని కిరణ్ చెప్పడంతో.. "మీరు చెప్పినట్లు మార్చ్ వాయిదా వేసుకుంటాం. అయితే తెలంగాణ ఏర్పాటు చేయాలని ఈసారి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేయండి. తెలంగాణకు అనుకూల ప్రకటన చేయమని కేంద్రానికి చెప్పండి'' అని కోరారు.
దీంతో ఆయన... 'అది నాతో అయ్యేదేనా? మీకు తెలియదా?' అని ప్రశ్నించారు. ఒకవేళ వాయిదా వేసుకుంటే జీవ వైవిధ్య సదస్సు అనంతరం మార్చ్‌కు నుమతిస్తారా అని హరీశ్ ప్రశ్నించారు. దీనికి సీఎం "ఒకటి రెండు పార్టీల ఆధ్వర్యంలో జరిగితే అనుమతించవచ్చు. ఎన్నో పార్టీలు పిలుపు ఇస్తే అనుమతి కష్టమే'' అన్నారు. 'మార్చ్ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో బోట్ ప్రయాణం చేస్తూ ఆందోళన చేసినట్లుగా మళ్లీ నిరసన తెలపనంటే నీ ఒక్కడికి మాత్రం అనుమతి ఇస్తా' అని నవ్వుతూ అన్నారు.
సీఎంతోపాటు తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా మార్చ్‌ను వాయిదా వేయించే ప్రయత్నాలు ప్రారంభించారు. జేఏసీ కన్వీనర్ కోదండరాంను కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ సంప్రదించి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. కానీ, వాయిదా సాధ్యం కాదని కోదండరాం చెప్పారు. జేఏసీ నేతలు శ్రీనివాస్ గౌడ్, విఠల్‌లతోనూ దానం దీనిపై మాట్లాడారు. కాగా, తెలంగాణ మార్చ్‌కి అనుమతి ఇవ్వలేదని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.
30న తలపెట్టిన మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఎదురైన అనుభవాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన కరీంనగర్‌లో అన్నారు. తెలంగాణ మార్చ్ వాయిదా వేసుకోవాలని సీఎం కోరడం తగదన్నారు. వ్యక్తిగతంగా ఏ అభిప్రాయం ఉన్నా సీఎంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. మార్చ్‌కు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ప్రకటించారని, మార్చ్‌లో పాల్గొనడంపై 25వ తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు.