హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చ్‌కు రావొద్దు, వస్తే..: నో పర్మిషనని డిజిపి వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DGP Dinesh Reddy
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతించలేదని, కాబట్టి తెలంగాణవాదులు ఎవరు కూడా హైదరాబాద్ రావొద్దని ఇంచార్జ్ డిజిపి దినేష్ రెడ్డి శుక్రవారం చెప్పారు. తెలంగాణ జిల్లాల నుండి కవాతు కోసం హైదరాబాద్ వచ్చే వారిని ఎక్కడికి అక్కడ అరెస్టు చేస్తామని హెచ్చరించారు. వినాయక నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు దృష్ట్యా కవాతును మరో రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాయిదా వేసుకుంటే అనుమతిస్తామని చెప్పారు.

కవాతులో అసాంఘిక శక్తులు, మతకల్లోల వంటి హింసాకాండ పెచ్చరిల్లే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నెల 30వ తేదిన ట్యాంక్‌బండ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారన్నారు. మంత్రులు కవాతుకు అనుమతించాలని తనను ఇప్పటి వరకు కోరలేదని, అలా కోరుతారని కూడా తాను భావించడం లేదన్నారు. నిరసన తెలపడం తెలంగాణవాదుల హక్కు అయినప్పటికీ... ఇతరులకు విఘాతం కల్పించడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు.

కవాతు కోసం ఎవరైనా వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నగరంలో ఎక్కడికి అక్కడ సిసి కెమెరాలు ఉన్నాయని, హింసాకాండకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెడతామని హెచ్చరించారు. మరో రోజుకు కవాతును వాయిదా వేసుకుంటే భద్రత కల్పిస్తామని డిజిపి హామీ ఇచ్చారు. నిమజ్జనం దృష్ట్యా వృద్ధులు, పిల్లలు, మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయని కాబట్టి వాయిదా వేసుకోవాలని నిర్వహాకులను కోరారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ పోలీసుల బాధ్యత అన్నారు.

రైల్ రోకో, రాస్తా రోకోలపై సుప్రీం కోర్టులో నిషేధం ఉందన్నారు. ట్యాంక్ బండ్ పైన కవాతు నిర్వహిస్తే రాస్తా రోకో కిందకు వస్తుందని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తప్పవన్నారు. కవాతుకు ఇది సరైన సమయం కాదన్నారు. దయచేసి కవాతును వాయిదా వేసుకోండని లేదంటే స్థలం మార్చుకోండని సూచించారు. కవాతు, నిమజ్జనం ఒకేచోట మంచిది కాదన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగవద్దని ముఖ్యమంతిరి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారన్నారు.

హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. టోల్‌ప్లాజా వంటి ఘటనలు జరగవని గ్యారెంటీ ఏమిటన్నారు. ఆ తర్వాత రోజు జీవ వైవిధ్య సదస్సు ఉందని, ఆ సదస్సుకు వచ్చే 193 దేశాల ప్రముఖుల బాధ్యత కూడా తమపై ఉందన్నారు. 29 అర్ధరాత్రి తర్వాత వినాయకులను నిమజ్జనానికి తీసుకు రాలేమని సూచించలేమన్నారు.

సిఎం ఆదేశాల ప్రకారం శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వదలబోమన్నారు. టోల్ గేటు ధ్వంసం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి వారిని క్షమించమన్నారు. విద్యార్థులు చేజేతులా వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. శాంతిభద్రతల విషయంలో వెనక్కి తగ్గే సమస్యే లేదన్నారు.

English summary
DGP of Andhra Pradesh, Dinesh Reddy warned Telanganites on Friday that don't come to Hyderabad for Telangana March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X