మోడీకి 'ఆకాశ్'ను బహుమతిగా పంపిన కేంద్రమంత్రి

ఆ సమయంలో ఆయన ఆకాష్ పిసిలను విద్యార్థులకు రూ.2,276కే ఇస్తామని చెప్పారు. దీనిపై ఇటీవల జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం ప్రసంగంలో మోడీ వీటిపై ఎద్దేవా చేశారు. సిబాల్ పదకొండు నెలల క్రితం విద్యార్థులకు అతి తక్కువ ధరకు ఆకాష్ టాబ్లెట్లు ఇస్తామని చెప్పారని, నెలలు గడుస్తున్నా విద్యార్థులకు అవి అందలేదని విమర్శించారు. ఈ టాబ్లెట్లు ఇంకా భూమికి చేరలేదని, అందుకే దీనికి ఆకాశ్ అని పేరు పెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మోడీ వ్యాఖ్యలపై స్పందించిన సిబాల్.. మోడికి రెండు ఆకాశ్ పిసిలను పంపించారు. దాంతో పాటు ఓ లేఖను కూడా పంపారు. రాజకీయాల్లోకి విద్యాంశాన్ని లాగవద్దని తన లేఖలో సూచించారు. రాజకీయ జోక్యంతో ఇప్పటికే విద్యా వ్యవస్థ నాశనమైందని, రాజకీయాలకతీతంగా అందరం కలిసి విద్యార్థుల కోసం పని చేద్దామన్నారు. అదే సమయంలో ఆకాశ్ టాబ్లెట్ పిసిల ఆలస్యం గురించి కూడా ప్రస్తావించారు.
కాగా కపిల్ సిబాల్ గతంలో విద్యార్థులకు ఆకాశ్ టాబ్లెట్స్ ఇస్తామని ప్రకటించారు. వీటిని 2,276 రూపాయలకే ఇస్తామని చెప్పారు. కానీ వాటి విడుదలలో కాస్త జాప్యం అయింది. టాబ్లెట్ పిసి అందుకున్న తర్వాతనైనా మోడీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు సిబాల్ చెప్పారు.