జగన్ పార్టీలో 'యాత్ర' గుబులు: రంగంలోకి విజయమ్మ?

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో జగన్ ఉన్నప్పడంతా ఉత్సాహం కనిపించడం లేదని, విజయమ్మ అప్పుడప్పుడు ధర్నాలు, ఆందోళనలు చేపట్టినప్పటికీ అది అప్పటికే పరిమితమవుతుందని అంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు దాదాపు నాలుగు నెలల పాటు యాత్ర తలపెట్టడంతో ఇప్పుడు అందరి నోళ్లలో టిడిపి పేరు నానుతోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తాము పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లకపోతే నష్టం జరుగుతుందని జగన్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట.
టిడిపికి, కాంగ్రెసుకు పార్టీలకు బేస్ ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు ఉప ఎన్నికలలో గెలిచినా, ప్రజల్లో మద్దతు కూడగట్టుకున్నా అదంతా సెంటిమెంట్ ప్రభావమే అనే వాదనలు ఉన్నాయి. సెంటిమెంట్ కొంతకాలం తర్వాత తగ్గితే జగన్ పార్టీపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఆ సెంటిమెంట్ తగ్గకుండా ఉండేందుకు లేదా తగ్గకముందే పార్టీని మూలాల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టాలని లేదంటే నష్టం తప్పదని చెబుతున్నారు.
బాబు యాత్రకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. దీనిని గమనించిన వైయస్సార్సీ క్యాడర్ కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టకుంటే నష్టం జరుగుతుందని భావిస్తున్నారట. జగన్ జైలులో ఉన్నందున పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. త్వరలో జగన్ విడుదలవుతారని ఆ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఈ శుక్రవారం జగన్ బెయిల్ పైన విచారణ జరగనుంది.
బెయిల్ వస్తే జగన్ వెంటనే రంగంలోకి దిగుతారు. ఓదార్పు యాత్ర, ఆందోళనలు, ధర్నాలు చేపట్టి ఆ పార్టీలో ఉత్సాహం నింపుతారు. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో విజయమ్మనే ఖచ్చితంగా రంగంలోకి దింపాలని యోచిస్తున్నారట. విజయమ్మతో పాటు జగన్ సోదరి షర్మిళను కూడా పార్టీ కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారట. ఉప ఎన్నికల సమయంలో షర్మిళ మాట, చేత అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications