ఎన్నికల యాత్ర: బాబుపై పితాని, వైస్రాయ్.. పొంగులేటి

చంద్రబాబు పాదయాత్ర చూస్తుంటే ఎన్నికల యాత్రను తలపిస్తోందని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆయన యాత్ర ప్రజలను మోసం చేసే యాత్ర అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ఈ యాత్ర చేస్తున్నారని, అసెంబ్లీలో ఒక్క రోజు కూడా ఒక్క ప్రజా సమస్య పైన చర్చించేందుకు సిద్ధపడని చంద్రబాబు వారి కష్టాలు తీరుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తన వైఖరితో ప్రతిపక్ష హోదా కోల్పోయారన్నారు.
విద్యుత్ శాఖకు మంత్రిని నియమిస్తే మంచిదని పితాని అభిప్రాయపడ్డారు. ఒక కుటుంబంలో ఒక్కరికే ఫీజు రీయింబర్సుమెంట్స్ వర్తిస్తుందనే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తుందనే వాదనలను ఆయన కొట్టి పారేశారు. ఆ దిశలో ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు.
కరెప్షన్ కింగ్ అవినీతిపై మాట్లాడటమేమిటని పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఆయన తన పాదయాత్రను హిందూపురం నుండి కాకుండా వైస్రాయ్ నుండి చేస్తే బాగుండేదన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తన అల్లుడిని జామాతా దశమగ్రహం అనే బిరుదుతో సత్కరించారని అన్నారు.
కాగా మంగళవారం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ... చంద్రబాబు పాదయాత్ర పైన సెటైర్ వేసిన విషయం తెలిసిందే. బాబు తన యాత్రకు వస్తున్నా మీకోసం కంటే వస్తున్నా నా కోసం అని పెట్టుకుంటే బాగుండేదన్నారు. ఆయన అధికారం కోసమే పాదయాత్ర చేపడుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications