• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పాదయాత్ర: చంద్రబాబు వైయస్‌ను అధిగమిస్తారా?

By Pratap
|

Chandrababu Naidu-YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఎంత వద్దనుకున్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వస్తున్నా మీకోసం పాదయాత్రను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో పోల్చి చూస్తున్నారు. ఎర్రటెండల్లో వైయస్ రాజశేఖర రెడ్డి 2004 సంవత్సరానికి ముందు చేసిన పాదయాత్రను ఈ రాష్ట్ర ప్రజలు అంత తేలిగ్గా మరిచిపోలేరు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఇప్పుడున్నట్లుగానే అప్పుడున్నాయి. ఆ స్థితిలో పంచెకట్టు, తలపాగా చుట్టి ప్రజలను అడుగడుగునా పలకరిస్తూ వైయస్ పాదయాత్ర సాగింది.

వైయస్ తర్వాత ఎంత మంది పాదయాత్రలు చేసినా అంతటి ప్రాముఖ్యం లభించలేదు. ఇక వైయస్ మరణించిన తర్వాత ఆయన కుమారుడు వైయస్ జగన్ చేసిన ఓదార్పు యాత్ర చేశారు. ఈ యాత్రతో జగన్ దాదాపు రాష్ట్రంలోని నలుమూలల్లోకి వెళ్లి వచ్చేశారు. అలా ఆయన తిరుగుతూ ఉన్న సందర్భంలోనే అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో సిబిఐ ఆయనను అరెస్టు చేసింది.

ఇప్పుడు చంద్రబాబు సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం మెడలు వంచి వాటిని పరిష్కరింపజేసేందుకే ఈ యాత్ర అని చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. తన ట్రేడ్ మార్క్ విక్టరీ సింబల్‌ను వదిలేసి రెండు చేతులూ జోడించి, ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. వైయస్ పాదయాత్రలో ఆయన ముఖ్య అనుచరులు వెంట సాగారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే ముందూ వెనకలు ఆలోచించకుండా అమలు చేశారు. రెండోసారి అధికారంలోకి రావడానికి అది పనిచేసింది. వైయస్ పాదయాత్రను ఎన్టీఆర్ పర్యటనలతో పోల్చడం కూడా అప్పుడే ప్రారంభమైంది. తెలుగుదేశం పాలనలో పూర్తిగా విసిగిపోయిన ప్రజలకు వైయస్ పాదయాత్ర ద్వారా ఓ నమ్మకం కలిగించారు. అయితే, కాంగ్రెసు పార్టీ విజయం సాధించడానికి వైయస్సార్ పాదయాత్ర ఒక్కటే కారణం కాదు.

కాంగ్రెసు నాయకులు తమలో తాము పోట్లాడుకోవడం మానేసి తెలుగుదేశం పార్టీని ఓడించే ఏకైక లక్ష్యంతో పనిచేశారు. కాంగ్రెసులోని నాయకులకు ఉన్న స్థాన బలిమి ఎక్కడికక్కడ క్యాడర్‌ను కూడగట్టుకోవడానికి వీలైంది. పాదయాత్ర ద్వారా వైయస్ కాంగ్రెసులో తిరుగులేని నాయకుడిగా ముందుకు వచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి పదవికి వైయస్ తప్ప మరో ప్రత్యామ్నాయం కాంగ్రెసు అధిష్టానానికి కనిపించలేదు.

వైయస్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఉన్న పరిస్థితులే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నప్పటికీ అన్నీ చంద్రబాబుకు కలిసి వస్తాయని చెప్పలేని పరిస్థితి. వైయస్ జగన్ జైలులో ఉండడం వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏ మేరకు బలహీనపడుతుందనే విషయంపై కూడా తెలుగుదేశం సాధించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అలాగే, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఏ మేరకు దెబ్బ తీయగలరనేది కూడా ముఖ్యమే అవుతుంది.

అయితే, చంద్రబాబు పాదయాత్ర ఫలితాలు మాత్రం సాధిస్తుందని చెప్పడానికి తగిన సూచనలు అందుతున్నాయి. పార్టీలో, ముఖ్యంగా నారా, నందమూరి కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలకు పరిష్కారం దానంతటదే లభించింది. చంద్రబాబు ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటారు, ప్రజలు ఆయనను ఏ మేరకు విశ్వసిస్తారనేది పాదయాత్ర వల్ల ఒనగూరే ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

English summary
Every body in the state is comparing Telugudesam president N Chandrababu Naidu's Mee kosam vastunna padayatra with late YS Rajasekhar Reddy's padayatra held before 2004 elections. Chandrababu wants to break YS Rajasekhar Reddy record with his padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X