• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నాడు నేను చెప్పిందే నిజమైంది: బాబు, బట్టలు ఇస్త్రీ

By Srinivas
|

Chandrababu Naidu
అనంతపురం: కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాడు తాను చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. రాష్ట్ర ప్రజలు చీకటిలో మగ్గుతున్నారని, ఇందుకు కారకులు నాటి వైయస్ రాజశేఖర రెడ్డి, నేటి కిరణ్ కుమార్ రెడ్డిలే అని మండిపడ్డారు. ఈ చీకటి పాలనను అంతమొందించడానికి తనతో కలిసి రావాలన్నారు. గాడితప్పిన పాలనను గాడిలో పెడదామని పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర మూడో రోజు గురువారం ఉదయం 11.20 గంటలకు సోమందేపల్లి నుంచి ఎల్‌బిజి నగర్ వరకు 16 కిలో మీటర్ల మేర సాగింది.

మొదటి రెండు రోజులూ అర్ధరాత్రి వరకూ కొనసాగినా.. మూడో రోజు మాత్రం రాత్రి 9.20 గంటలకే తురకలాపట్నంలో చంద్రబాబు తన పాదయాత్రను ముగించారు. పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకు నీరాజనం పలికారు. పెనుకొండ సభలోనే ప్రసంగించారు. కాంగ్రెస్ పాలన వస్తే చీకటి రోజులు తప్పవని తాను ఆనాడే హెచ్చరించానని, నేడు అదే జరుగుతోందని, నేటి పరిస్థితులకు కారకుడు వైయస్, కిరణ్ అన్నారు. విద్యుత్ రంగంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించి భ్రష్టు పట్టించారని, వారి చేతకానితనం వల్లనే నేడు విద్యుత్‌రంగం నాశనమైందన్నారు.

టిడిపి హయాంలో గృహావసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేశామని గుర్తుచేశారు. ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టానని, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. "నా తొమ్మిదేళ్ల పాలనలో సుదీర్ఘ కరువు వచ్చినా కరెంటు సమస్య లేకుండా చూశాను. పరిశ్రమలకు పూర్తిస్థాయిలో కరెంటు పంపిణీ చేశాం. ఇప్పుడు కరెంటు కోతలతో పిల్లల చదువు సాగడం లేదు. ధరలపై నియంత్రణ లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు చదవలేకపోతున్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదు. తాగునీరు ఇవ్వలేకపోతున్నారు. కానీ బెల్టు షాపులతో ప్రతి చోటా మద్యం అందుబాటులో ఉంచారు. కాంగ్రెస్ పాలకులు పందికొక్కుల్లా మేస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును విదేశీ బ్యాంకుల్లో భద్రం చేసుకుంటున్నారు'' అని ధ్వజమెత్తారు.

"మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని నేను భావించాను. డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేశాను. రుణాలు, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వారి అభివృద్ధికి బాటలు వేశాను. పావలావడ్డీ పేరుతో వారిని అప్పుల్లో కూరుకుపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది'' అని చంద్రబాబు ధ్వజమెత్తారు. విచ్చలవిడిగా మద్యం షాపులు మంజూరు చేసి భారీ ఆదాయం సమకూర్చుకుంటూ మహిళలను కన్నీటిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే మద్య నియంత్రణ పాటిస్తామని చెప్పారు.

కాగా చంద్రబాబు యాత్రలో ఉత్సాహంగా దూసుకు పోతున్నారు. ఓ చోట బట్టలు ఇస్త్రీ చేసి ఆకట్టుకున్నారు. పలు ఆలయాలు, దర్గాలు, చర్చిలను దర్శించుకున్నారు. మహిళల వద్దకు వెళ్లి వారి కష్ట నష్టాలను అడిగారు. వెంకటాపురం తాండాలో ఓ ఇంటిలోకి వెళ్లి వారి జీవన పరిస్థితులను పరిశీలించారు. చంద్రబాబు మూడో రోజు 16 కిలోమీటర్లు నడిచారు.

English summary

 TDP chief Nara Chandrababu Naidu's 'Vastunna Mee Kosam' march is evolving into a new model, akin to a relay in athletics. On the third day of his walkathon on Thursday Naidu was seen asking people who are non-party activists to accompany him up to the next destination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X