యాత్రా స్పెషల్: భారతి కాకుండా షర్మిళ ఎందుకు?

అయితే, యాత్రకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పేర్లను కూడా పరిశీలించారు. వారిద్దరితో పాటు షర్మిళ చేత కూడా పాదయాత్రలు చేయించాలని తొలుత అనుకున్నారు. కానీ, చివరకు షర్మిళ చేత యాత్ర చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు కారణమేమిటనేది ఆసక్తికరంగా మారింది. పాదయాత్ర చేపడితే మరో పని చేయడానికి వీలుండదు. దానికి తోడు, ఆరోగ్యం కూడా సహకరించాలి. ఈ రెండు కారణాల వల్ల వైయస్ విజయమ్మ, భారతి పేర్లను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల వ్యవహారాలను భారతి చూసుకోవాల్సి ఉంటుంది. పైగా, కోర్టు వ్యవహారాలను నిత్యం సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ స్థితిలో భారతి పాదయాత్ర చేపట్టడానికి ఏ మాత్రం వీలు కాదు. కాగా, వైయస్ విజయమ్మ ఆరోగ్యం పాదయాత్రకు సహకరించకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో షర్మిళ పేరు ప్రధానంగా ముందుకు వచ్చింది.
షర్మిళకు ఏ విధమైన ఆటంకాలు ఉండవని, ఆమె పాదయాత్ర చేస్తే ఫలితం కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికల సమయంలో ఆమె ప్రసంగాలు, హావభావాలను విపరీతంగా ఆకట్టుకున్నట్లు భావించారు. దానికి సెంటిమెంట్ కూడా తోడవుతుందని అనుకుంటున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెను ప్రజలు విశేషంగా ఆదరిస్తారని అంటున్నారు.
పైగా, చంద్రబాబు పాదయాత్రను అధిగమించేలా ఈ యాత్ర ఉండాలి. 2,500 కిలోమీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అంత సుదీర్ఘమైన యాత్ర షర్మిళ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే షర్మిళ యాత్రకు వైయస్ జగన్ పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. షర్మిళ చేపట్టేది పాదయాత్రనా, ఓదార్పు యాత్రనా అనేది ఈ నెల 10వ తేదీన తేలుతుంది.












Click it and Unblock the Notifications