పాదయాత్ర ఎఫెక్ట్: షర్మిలను టార్గెట్ చేస్తున్న టిడిపి

షర్మిల పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం నాయకులు దూకుడుగా ముందుకు వస్తున్నారు. షర్మిల పాదయాత్రపై కాంగ్రెసు నాయకుల కన్నా తెలుగుదేశం నాయకులు ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ తెలుగుదేశం నేతలు కూడా ఆమెను వదిలిపెట్టడం లేదు.
షర్మిల పాదయాత్రను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రిలే పాదయాత్రగా అభివర్ణించారు. షర్మిల పాదయాత్ర ఆరంభిస్తారని, జగన్ విడుదల అయితే ఆయన కొనసాగిస్తారని విజయమ్మ చెప్పిన మాటపై ఆయన శుక్రవారం కాకినాడలో వ్యంగ్యాస్త్రం సంధించారు. ఎవరు ఎంత దూరం నడుస్తారో చెప్పాలని ఆయన అన్నారు.
షర్మిల పాదయాత్ర జనం కోసం కాదని, జగన్ జైలులో ఉన్నారని చెప్పి జనం సానుభూతి పొందడం కోసమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా షర్మిల పాదయాత్రపై విరుచుకుపడ్డారు. జగన్ చేసిన అవినీతి గురించి పాదయాత్రలో చెప్పి ప్రజల ఆమోదముద్ర పొందుతారా అని ఆమె షర్మిలను ప్రశ్నించారు.
వైయస్ విజయమ్మ ప్రణబ్ ముఖర్జీని కలవడంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రణబ్ ముఖర్డీ ద్వారా కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు వైయస్ విజయమ్మ ఏం రాయబారం పంపారో చెప్పాలని ఆయన శుక్రవారం అడిగారు. జగన్‌ను కేసుల నుంచి బయటపడేయడానికి అవిశ్వాస తీర్మానాన్ని తెర మీదికి తెస్తున్నారని ఆయన శుక్రవారం అన్నారు. అవిశ్వాసం పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని, కాంగ్రెసు అధిష్టానాన్ని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.