తెలంగాణ ఇస్తామని ప్రకటించింది మనమే: ఆజాద్‌కు కెకె

తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని తెలిసి కూడా గులాం నబీ ఆజాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిందన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు తెలంగాణకు ఒప్పుకున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే ఆజాద్ వ్యాఖ్యల ఉద్దేశ్యమా అని ఆయన ప్రశ్నించారు. 2009 ఫిబ్రవరిలో కూడా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ అనుకూల ప్రకటన చేశారన్నారు.
తెలంగాణను తేల్చాల్సింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. కేంద్రం త్వరలో తెలంగాణ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దని హితవు పలికారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 700 బలిదానాలు జరిగాయని తెలిసిన తర్వాత కూడా ఇలా మాట్లాడటమేమిటన్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే కాంగ్రెసు పార్టీకి ప్రజలు క్రమంగా దూరమవుతున్నారని విమర్శించారు.
తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఆజాద్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాటలు నమ్ముకోకండన్న విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెసు ఓడిపోవాలనుకుంటున్నారా, ఇతర పార్టీలలో కాంగ్రెసు నేతలు చేరాలని చూస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. తనలాంటి వాళ్లు రిటైర్మెంట్ తీసుకుంటారని, ఇతరులు ఏం చేస్తారో తనకు తెలియదన్నారు. ఆజాద్ వ్యాఖ్యలు తన చెంపమీద కొట్టినట్లుగా ఉన్నాయన్నారు.
డికె అరుణకు సవాల్
తెలంగాణ ప్రాంత ఎంపీలు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందన్న మంత్రి డికె అరుణ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. టిఎంపీలతో తెలంగాణ వస్తుందంటే రెండు నిమిషాల్లో రాజీనామా చేయిస్తానని చెప్పారు. అప్పటికీ రాకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తమతో కలిసి వస్తారా అని సవాల్ విసిరారు. ఇరవై మంది ఎమ్మెల్యేలు సభకు రామని చెబితే పార్టీ అధిష్టానం దిగి రాక తప్పదని కెకె అన్నారు.












Click it and Unblock the Notifications