కెసిఆర్, కోదండరామ్‌లను ఏకం చేసిన ప్రధాని విజిట్

ప్రధాని పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేసే విషయంపై ఆదివారంనాడు కెసిఆర్ ఫోన్‌లో కోదండరామ్‌తో మాట్లాడారు. నిజానికి, ఆదివారంనాడు వారిద్దరు కలుసుకోవాల్సి ఉండింది. అయితే, కెసిఆర్ సోదరి మృతి కారణంగా అది సాధ్యపడలేదు. ఇరువురి మధ్య విభేదాలు తొలగిపోయాయని, ఇరువురు కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి నిర్ణయించుకున్నారని తెరాస వర్గాలంటున్నాయి.
కోదండరామ్ కెసిఆర్‌కు ఫోన్ చేసి తెలంగాణవాదులందరూ కలిసి ప్రధాని పర్యటనకు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంపై మాట్లాడారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై అధికారికంగా జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అక్టోబర్ నెలాఖరు వరకు యుపిఎ ప్రతినిధులతో కెసిఆర్ చర్చలు జరుపుతారని, అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ముందుకు రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసే విషయంపై ఆలోచిస్తారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెలాఖరులోగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపడుతారని, అది ముగియగానే తెలంగాణపై తనతో మళ్లీ చర్చలు ఉంటాయని కెసిఆర్ అంటున్నారు. అయితే, అలా జరగకపోతే మాత్రం ఉద్యమ బాట పట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని అనుకుంటున్నామని, అలా రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెరాస మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications