ప్రాణం తీసిన ఫేస్‌బుక్ లవ్: కూతురికి తండ్రి ఆరుపెళ్లిళ్లు

ప్రాణం తీసిన ఫేస్‌బుక్ ప్రేమ
సోషల్ వెబ్‌సైట్‌లో చిగురించిన ప్రేమ చివరకు ప్రాణం తీసింది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఫేస్‌బుక్‌లో ఇరవై ఆరేళ్ల యువకుడితో ఇరవై రెండేళ్ల యువతికి పరిచయం అయింది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే వీరి మధ్య కొద్దిరోజుల్లోనే విభేదాలు వచ్చాయి. తనతో మాట్లాడ వద్దని ప్రియురాలు చెప్పింది. అయితే దీనిని అతను పట్టించుకోలేదు.
దీంతో ఆమె పోలీసు స్టేషన్‌లో సదరు యువకుడిపై పైన ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిని పోలీసు స్టేషన్‌కి పిలిపించి మందలించారు. ప్రేమలో మోసపోయానంటూ ఆ యువకుడు రెండు రోజులుగా డిసప్పాయింట్‌కు గురై, తన చావుకు ప్రియురాలు కారణమని లేఖలో రాసి గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తండ్రిని హత్య చేసిన కూతురు
డబ్బు కోసం తన కూతురికి ఆరుగురితో పెళ్లి చేయించిన ఓ తండ్రిని కూతురు హత్య చేసింది. బెంగళూరు శివారు ప్రాంతంలోని హెబ్బగోడి పరిధిలో ఇది జరిగింది. తమిళనాడుకు చెందిన బాలరాజు కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉంటున్నారు. అతనికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య కుమార్తె శివరాణి. తానే సంబధాల్ని తీసుకు వచ్చి శివరాణికి అతడు ఆరు వివాహాలు చేయించాడు. అన్నీ రిజిస్టర్ ఆఫీసులో సాదాసీదాగా జరిపించాడు. పెళ్లైన కొద్దిరోజులకే అల్లుడితో గొడవపెట్టి కుమార్తెను విడగొట్టేవాడు.
ఇలా ఆరు పెళ్లిళ్లు చేశాడు. ఆరో భర్తతోనే సంసారం కొనసాగించాలని శివరాణి నిర్ణయించుకుంది. తండ్రి ఒత్తిడి భరించలేక అతని అడ్డు తొలగించుకోవడానికి ఆమె తీర్మానించుకొని నాలుగో భర్త బంధువులతో కలిసి తండ్రికి మద్యంలో విషాన్ని కలిపి చంపారు. తానే తన తండ్రిని హత్య చేసినట్లు కూతురు ఒప్పుకుంది.












Click it and Unblock the Notifications