పార్టీలను నడిపించే నేతల వెనుక 'సూపర్ పవర్స్'
హైదరాబాద్: పార్టీలను నడిపించే అధినేతల వెనుక సూపర్ పవర్ ఉంటుంది! పార్టీని నడిపేది అధినేతలే అయినప్పటికీ వారిని నడిపించేందుకు వేరే వారు ఉంటారు! అయితే వెనుక ఉన్న వారిలోనూ ఒక్కోరకంగా ఉంటారు. కొందరు తమకు పార్టీలో, ప్రజల్లో ఉన్న పట్టుతో పార్టీని పరోక్షంగా కమాండ్ చేస్తే, ఇంకొందరు అభిమానంతోనే లేక ఆయా పార్టీల కోరిక మేరకో సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
బావమరదుల చాటు బావ!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంతగా ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ అదంతా స్వర్గీయ నందమూరి తారక రామారావు చలువే. పార్టీని స్థాపించిందే ఎన్టీఆర్. అందుకే ఆయన నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాల్సిందే. అందుకే ఎప్పుడైనా నందమూరి హరికృష్ణ అసంతృప్తికి లోనయ్యారంటే పార్టీలో అది పెను సంక్షోభంగా కనిపిస్తోంది. పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నప్పటికీ ఆయన తన బావమరుదులు నందమూరి బాలకృష్ణ, హరికృష్ణల సూచనలు తప్పకుండా కొన్ని పాటిస్తారట.
టిడిపికి నందమూరి కుటుంబమే ఆయువుపట్టు. నారా - నందమూరి కుటుంబాలు కలిస్తేనే టిడిపి అని చెప్పినప్పటికీ నందమూరి కుటుంబమే కాస్త ఎక్కువ అని చెప్పవచ్చు. హీరో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు పార్టీపై అసంతృప్తితో రగిలినప్పుడు టిడిపిని కదిలించడమే కాకుండా, రాజకీయ వర్గాల్లో, రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక బాలకృష్ణ బావకు వ్యతిరేకంగా పెదవి విప్పితే ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. అయితే బాలయ్య ఎప్పుడూ బావకు అండగానే నిలుస్తున్నారు.
అయితే బాలకృష్ణ గానీ, హరికృష్ణ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ కొన్ని సందర్భాలలో చంద్రబాబు ముందు తమ డిమాండ్లు పెట్టి నెగ్గించుకున్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. గుడివాడ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని జూనియర్ అండతోనే గెలుపొందారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బాలకృష్ణ సూచించిన అభ్యర్థినే చంద్రబాబు నిలబెట్టవలసి వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. హరికృష్ణ కూడా పలు సందర్భాలలో తన డిమాండ్లు బాబు ముందు పెట్టి సాధించుకున్నారట. అంతేకాకుండా నందమూరి కుటుంబ సభ్యులు క్రౌడ్ పుల్లర్స్.
జగన్ వెనుక వైవి సుబ్బారెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఆయన బాబాయి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే సాగుతాయి. పార్టీకి ఈయనే సూపర్ పవర్ అయినప్పటికీ జగన్‌తో చర్చించిన పిదపనే నిర్ణయాలు ఉంటాయి. అసంతృప్తి గొడవలు, భిన్నాభిప్రాయాలు జగన్, వైవి మధ్య ఉండవట. అయితే జగన్‌కు మాత్రం నిత్యం అండగా ఉంటారు.
ఇక్కడ జగనే క్రౌడ్ పుల్లర్. జగనే పార్టీ అధినేత. అయినప్పటికీ తన బాబాయి సూచనలను, సలహాలను జగన్ తప్పకుండా తీసుకుంటారట. ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్నారు. అయతే ఆయన జైలులో ఉన్నప్పటికీ విజయమ్మ, షర్మిలలు కూడా వైవి సుబ్బారెడ్డి సూచనల మేరకే నడుస్తారట.
సిఎం కిరణ్ వెనుక సోదరులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వెనుక ఆయన సోదరులు సంతోష్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. కిరణ్ సిఎం అయ్యాక ఓ సోదరుడు బెంగళూరులో బాగా నడుస్తున్న తన సాఫ్టువేర్ కంపెనీని కూడా వదిలేసి వచ్చారట. కిరణ్ సోదరులు చిత్తూరు జిల్లాలో తమ పట్టును పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే పలు వ్యవహారాల్లో చేయి పెడుతున్నారట. మాజీ మంత్రి శంకర రావు కిరణ్ సోదరుడిపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ పాత్ర చాలా కీలకం. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన అనంతరం బాలకృష్ణ పార్టీ వ్యవహారాలపై మరింత దృష్టి సారించారు. ఆయన జిల్లా స్థాయి నేతలతో ఇటీవలి వరకు సమావేశమై ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు.

హీరో జూనియర్ ఎన్టీఆర్ గతంలో తనకు అత్యంత సన్నిహితుడైన గుడివాడ ప్రస్తుత శాసనసభ్యుడు కొడాలి నానికి టిక్కెట్ ఇప్పించి గెలిపించారు. ఇందుకోసం జూనియర్ పార్టీ అధినేత, తన మావయ్య చంద్రబాబు వద్ద పట్టుబట్టి ఒప్పించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన బాబాయి వైవి సుబ్బారెడ్డి అండ ఉంది. బాబాయి సూచనలు, సలహాల మేరకే జగన్ ముందుకు వెళ్తారట.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు పార్టీ వ్యవహారాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారనే విమర్శలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ. అయితే కూతురు, తనయుడు కూడా కీ రోల్ పోషిస్తారు.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనలనే పాటిస్తారనే విమర్శలు జోరుగా ఉన్నాయి.
కెసిఆరే అంతా అయినా
తెలంగాణ రాష్ట్ర సమితి విషయానికి వస్తే కర్త, కర్మ, క్రియ అంతా ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే. అయితే బయట ఆయన కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆయన తనయుడు సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు హవా కూడా ఉంటుందనే ఆరోపణలు వస్తుంటాయి.
మన్మోహన్‌ను నడిపిస్తున్న సోనియా
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నడిపిస్తున్నారనే విషయాన్ని కేవలం భారత ప్రజలు మాత్రమే కాదు... విదేశాలు కూడా గుర్తించాయి! ప్రధాని ప్రతి నిర్ణయం వెనుక సోనియానే ఉంటుందని, ఆమె ఆలోచనను కాదని ప్రధాని ఓ నిర్ణయాన్ని తీసుకునే సాహసం చేయరనే వాదన ఉండనే ఉంది.












Click it and Unblock the Notifications