జగన్ జైలు వివరాలివ్వండి: ఆర్టీఐకింద టిడిపి పిటిషన్

జైలు సిబ్బంది సెల్‌ఫోన్ల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ వివరాలను, విఐపి ఖైదీల కోసం కేటాయించిన సిబ్బంది పేర్లు, వారి అధికారిక హోదాలు, ఈ ఏడాది మే నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ నెల 20వ తేదీ వరకూ జైలులో జగన్‌ను కలవడానికి అనుమతించిన వారి వివరాలు, విచారణ ఖైదీలను సందర్శకులు కలవడానికి సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలు, జైలులో అమర్చి ఉన్న సిసి కెమెరాలు, వాటి రికార్డింగుల వివరాలను అందజేయాలని యనమల కోరారు.
కాగా రెండు రోజుల క్రితం యనమల మాట్లాడుతూ... వైయస్ జగన్ చంచల్‌గూడ జైలు నుండే రాజకీయాలు నెరపుతున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న వైయస్ జగన్‌కు జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని తాము రాష్ట్ర డిజిపికి లేఖ రాశామని చెప్పారు.
ఆస్తుల కేసులో నిందితుడైన జగన్ నిబంధనలకు విరుద్దంగా జైలులో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారని, విచ్చలవిడిగా సెల్ ఫోన్ సౌకర్యం కల్పించారని, ఎవరికీ లేని సౌకర్యాలు కల్పిస్తున్నారని, జైలులో రాజకీయ భేటీలకు అవకాశం కల్పిస్తున్నారని యనమల అన్నారు. వీటిపై తాము లేఖ రాసినట్లు చెప్పారు. జగన్‌ను ఎవరెవరు కలుస్తున్నారో ఎందుకు రికార్డు చేయడం లేదన్నారు. సిసి కెమెరాలు ఉన్నప్పటికీ వాటిని రికార్డ్ చేసినట్లుగా కనిపించడం లేదన్నారు.
వీడియో ఫుటేజ్‌లు ఉంటే వెంటనే వాటిని మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌కు జైలులో అన్ని సౌకర్యాలు కల్పించే అంశంపై అవసరమైతే తాము న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తామన్నారు. జగన్‌ను జైలులో ఎవరెవరు కలుస్తాన్నారో వివరాలు మీడియాకు ఇవ్వాలన్నారు. తాను డిజిపికి లేఖ రాసి మూడు రోజులు గడిచినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదని యనమల చెప్పారు.
కాగా జగన్‌కు జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదని జైలు అధికారులు చెబుతున్నారు. జగన్‌ను కలిసే సదుపాయాన్ని నిబంధనల ప్రకారమే అమలు చేస్తున్నామని, జైల్లో జగన్ సెల్ ఉపయోగించడం లేదని, జైలు భద్రతను పటిష్టం చేసేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications