ఎన్నికలు: టి-ఎంపీల గుండెల్లో రైళ్లు, పక్క చూపులు

జాతీయ రాజకీయాలు అస్తవ్యస్తంగా మారడంతో ఎప్పుడు ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఎవరు చేయిస్తారో, ఎవరు చేయందిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికలు ముందుగానే రానున్నాయనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఈ భయమే ఇప్పుడు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలను పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోని పక్షంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.
తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అనే నినాదంతో వారు ముందుకు వెళ్తున్నారు. టిఆర్ఎస్, టిజెఏసి నేతలతో కలిసి వారు ఉద్యమాలు చేశారు. అరెస్టయ్యారు. తెలంగాణ కోసం ఇంతగా ప్రయత్నించిన వారిపై ప్రజలకు సానుభూతి ఉందని, అయితే కాంగ్రెసు తెలంగాణపై తేల్చకుండా అదే పార్టీ నుండి పోటీ చేస్తే మాత్రం ప్రజలు వారిని ఆమోదించక పోవచ్చునని చెబుతున్నారు. వారిలో కూడా అదే భయం కనిపిస్తోందట.
పార్టీ తెలంగాణపై వైఖరి చెప్పకున్నా ఇన్నాళ్లూ తాము చేసిన ఉద్యమం ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నామని, తద్వారా గెలుపొందవచ్చుననుకునే వారికి మరో ఇబ్బంది ఉందంటున్నారు. నిత్యం ఉద్యమాల పేరుతో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిన వారికి పార్టీ టిక్కెట్ ఇచ్చే విషయమై ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇటీవల జరిగిన విస్తరణలో పార్టీ పట్ల విశ్వాసంతో ఉండి, ఇబ్బందులు తీసుకు రాని వారికే మంత్రి పదవులు కట్టబెట్టారు.
దీనిని బట్టి చూస్తుంటే ఉద్యమం పేరుతో పార్టీని ఇబ్బందులకు గురి చేసిన వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వక పోవచ్చునని అంటున్నారు. పార్టీ తెలంగాణపై తేల్చకుంటే ప్రజల్లోకి వెళ్లగలమా? వెళితే ఆమోదిస్తారా? పార్టీ టిక్కెట్ ఇస్తుందా? అని ఆందోళన చెందుతున్న నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారట. కొందరు టిఆర్ఎస్‌లోకి, మరికొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నారట. అయితే పార్టీ అధిష్టానం నుండి తెలంగాణపై ఎలాంటి నిర్ణయం రాకపోతేనే చివరి నిమిషంలో జంప్ చేయాలని భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications