జగన్ 'మూస'లోనే యాత్ర: షర్మిలలో జోష్ తగ్గిందా!?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మరో ప్రజా ప్రస్థానం ఉత్సాహంగా కొనసాగుతుందా అంటే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షర్మిల పాదయాత్ర ఉత్సాహంగా, ప్రజాభిమానంతో కొనసాగుతోందని జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సెంటిమెంట్ లేదా మరే కారణంతోనైనా జగన్‌పై అభిమానం ఉన్నప్పటికీ షర్మిల పాదయాత్ర మాత్రం క్రమంగా చప్పగా మారిపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

షర్మిల మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు అందర్నీ ఆకట్టుకున్నారు. ఆమె హావభావాలు, మాట తీరు దివంగత వైయస్‌లా ఉందంటూ కితాబిచ్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రచారం చేసినప్పటికీ అందరూ షర్మిల పైనే కాన్సంట్రేషన్ పెట్టారు.

షర్మిల పాదయాత్రలో జోష్ తగ్గుతోందని అంటున్నారు. కడప జిల్లా సొంత ఇలాకా కాబట్టి అంత హడావుడి కనిపించిందని, కానీ అనంతపురం జిల్లాలో అది కనిపించడం లేదంటున్నారు. ఆమె అదే పనిగా మూస ధోరణిలో విమర్శలు చేస్తుండటంతో ప్రజలకు ఎక్కడం లేదంటున్నారు.

గతంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో కూడా అతని ప్రసంగం మూసధోరణిలో ఉందని, ప్రజలకు బోర్ కొట్టించిందనే విమర్శలు వచ్చాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన రూట్లోనే షర్మిల వెళుతున్న ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని, కొందరు కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా జోష్ కనిపించడం లేదని చెబుతున్నారని అంటున్నారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న అశేష జనవాహినే అందుకు మంచి నిదర్శనం అంటున్నారు.
కడప జిల్లాలో కనిపించిన జోష్ అనంతపురం జిల్లాలో కనిపించడం లేదని, క్రమంగా జోష్ తగ్గిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో అంత ఆదరణ కనిపించడానికి కారణం అది జగన్ సొంత జిల్లా కావడమే అంటున్నారు. ముప్పై ఐదేళ్లుగా కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందులలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం హవానే కొనసాగుతోందని, అలాగే షర్మిల తొలిసారి పాదయాత్ర చేపట్టిందని అందుకే అంత ఆదరణ కనిపించిందని అంటున్నారు.
అనంతపురం జిల్లాలోను మొదట కనిపించిన జోష్ ఆ తర్వాత కనిపించడం లేదంటున్నారు. అయితే అందుకు పార్టీ పట్ల అభిమానం లేకపోవడమో లేక జగన్‌కు ఆదరణ లేకపోవడమో కారణం కాదంటున్నారు. షర్మిల ప్రసంగంలో పస లేకపోవడం వల్లనే అంత జోష్ కనిపించడం లేదంటున్నారు. గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు షర్మిల ప్రసంగానికి అనూహ్య స్పందన వచ్చింది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆమె ప్రసంగంలో కొత్తదనం లేకపోవడంతో బోర్ కొడుతున్నట్లుగా ఫీల్ అవుతున్నారేమో అంటున్నారు.
ఆమె పాదయాత్ర ప్రారంభించి దాదాపు ఇరవై రోజులు కావొస్తుందని కానీ ఇప్పటి వరకు ఆమె ప్రసంగం మూసధోరణిలోనే కొనసాగుతోందంటున్నారు. జోష్ తగ్గడానికి ప్రధానమైన కారణం ఇదే అంటున్నారు. షర్మిల ఎక్కడ ప్రసంగించినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాలనను విమర్శించడం, ఆ విమర్శల్లో కూడా కొత్తదనం లేకపోవడం, కాంగ్రెసుతో కుమ్మక్కు అని చెప్పడం, కిరణ్ ప్రభుత్వం వైయస్ పథకాలను తుంగలో తొక్కిందని చెప్పడం మినహా కొత్తదనం లేకపోవడంతో నిరుత్సాహం కనిపిస్తోందని అంటున్నారు.
షర్మిల మూసధోరణి ప్రసంగం ప్రజలకు ఎక్కక పోవడంతో కొత్త ప్రసంగ పాఠం కోసం పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే సుదీర్ఘ పాదయాత్ర చేపట్టినప్పుడు రోజుకో కొత్త విషయం చెప్పేందుకు ఏమి ఉంటుందని, షర్మిల ప్రసంగం బాగానే అకట్టుకుంటుందని ఇంకొందరు చెబుతున్నారు. తప్పుడు సంకేతాలు పంపించేందుకే కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారనేది వారి వాదన. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు కూడా మూసధోరణి ప్రసంగం అంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications