సోనియా దిగిపోమంటే తప్పదు: బొత్స, జగన్‌పై సెటైర్లు

తుఫాను ప్రభావంతో నష్టం భారీగా ఉందంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఖచ్చితంగా పర్యటిస్తారన్నారు. కనివినీ ఎరుగని రీతిలో నష్టం జరిగిన విషయం నిజమే అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడు జిల్లాల్లో నష్టం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం పేదవాడి, సామాన్యుడి, రైతు ప్రభుత్వమన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణపై ఎవరికీ బేధాభిప్రాయాలు లేవన్నారు.
తన కూతురు పెళ్లిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను తలదించుకుంటానని, ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో తాను గానీ, తన కుటుంబం గానీ ఎప్పుడూ ఎక్కడా చిన్న పొరపాటు కూడా చేయలేదన్నారు. తాము ఒక్క సెంట్ భూమిని కూడా ఎక్కడా ఆక్రమించలేదని బొత్స తెలిపారు. తమకు ఆ అవసరం కూడా లేదన్నారు.
తుఫానుతో కనీవినీ ఎరుగని నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మరింత సాయం చేయాలని పార్టీ తరఫున కోరుతున్నామన్నారు. తుఫాన్ విషయంలో ప్రతిపక్షాలవి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు బాగానే స్పందించారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎక్కడా పని లేదు. కాబట్టే ఆయన అరగంటలో ఎక్కడికైనా వెళ్లగలరన్నారు.
ముఖ్యమంత్రి వెళ్లాలంటే అధికారయంత్రాన్ని సమాయత్తం చేయాలని, అధికారులకు విధులలో ఇబ్బందులు కలిగించడం తమ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అందుకే కిరణ్ తర్వాత వెళ్లారన్నారు. పంట నష్టాన్ని తామూ చూశామని, ఆదుకుంటామన్నారు. వరదల్లో ప్రభుత్వం యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని కితాబిచ్చారు. ఖాళీగా కూర్చునే ప్రతిపక్ష నేతలు వెళ్లి పరామర్శిస్తే మంచిదే అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు కష్టాలు ఉండవని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పటం హాస్యాస్పదం అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తుఫాన్లు రావా, వర్షాలు ఆగిపోతాయా అని ఎద్దేవా చేశారు. లేకుంటే విజయమ్మ వద్ద ఏదైనా పాతాల భైరవి మంత్రం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ఓ వర్గం మీడియా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తాను ఇద్దరం అధిష్టానం నామినేట్ చేస్తే పదవిలోకి వచ్చామన్నారు. తమను మార్చే సర్వాధికారాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాత్రమే ఉందన్నారు. సోనియా గాంధీ ఎప్పుడు దిగిపోమంటే అప్పుడు దిగిపోక తప్పదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎర్రన్నాయుడిది ప్రత్యేక స్థానం అన్నారు. సంతాప సందేశాన్ని తీసుకొని సోనియా తనను వెళ్లమన్నారని, కానీ కూతురు పెళ్లి కారణంగా వెళ్లలేక పోయానన్నారు. వర్ధంతి సభలో పాల్గొంటానని చెప్పారు.
కాగా బొత్స ఆరు జిల్లాల డిసిసి, మూడు నగర పార్టీల అధ్యక్షులను బొత్స ప్రకటించారు. మిగిలినవి గురువారం ప్రకటిస్తానని చెప్పారు.
మెదక్ - భూపాల్ రెడ్డి
శ్రీకాకుళం - నరేంద్ర యాదవ్
చిత్తూరు - రాజశేఖర రెడ్డి
గుంటూరు - మక్కెన మల్లికార్జున రావు
కాకినాడ - మిడియం హరి
విశాఖ - ధర్మశ్రీ
వరంగల్ - మాధవ రెడ్డి
రాజమండ్రి - నక్కా నాగేష్
విజయవాడ - నాగేంద్ర ప్రసాద్












Click it and Unblock the Notifications