భూమి: కృష్ణ దంపతులకు బాబు, వైయస్ ఫేవర్

భూ స్వాధీనం నోటిఫికేషన్ నుంచి తమ భూమిని మినహాయించాలని కోరుతూ కృష్ణ, విజయనిర్మల 2003 అక్టోబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసినట్లు ఐఎఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. అప్పుడు ఎస్వీ ప్రసాద్ ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. ఆ భూమిపై స్టేటస్ రిపోర్టు కోసం ఎపిఐఐసి ఎండికి, రంగా రెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖలు రాయాలని అప్పటి ముఖ్యమంత్రి సూచన మేరకు తాను వ్యవహరించానని ఎస్పీ ప్రసాద్ చెప్పారు.
భూస్వాధీనానికి నోడల్ ఆఫీసుగా పనిచేస్తున్న వాణిజ్య, పరిశ్రమల శాఖకు స్టేటస్ రిపోర్టులు వస్తాయని, వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తారని, అయితే అటువంటి రిపో్ర్టు తన హయాంలో సిఎంఒకు రాలేదని ఆయన చెప్పారు. కృష్ణ దంపతుల భూమిని మినహాయించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి ఆదేశాలు వెళ్లలేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అటువంటి ఆదేశాలు ఏమైనా ఇచ్చారేమో తెలియదని ఆయన అన్నారు.
2004లో వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణ దంపతులకు మేలు చేశారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డి ఎస్పీ ప్రసాద్ రాసిన లేఖలను తెప్పించుకున్నారు. తుది నివేదిక అందే వరకు ఆ భూముల స్వాధీనాన్ని పెండింగులో పెట్టినట్లు రాశారని ఎస్పీ ప్రసాద్ చెప్పారు. దానిపై వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, ఆ భూములకు మినహాయింపు కొనసాగుతూ వచ్చిందని సిబిఐ చార్జిషీట్‌లో తెలిపారు.












Click it and Unblock the Notifications