కసబ్‌కు ఉరిశిక్ష: చివరి కోరిక ఏదీ కోరలేదట...
పూణే: పూణేలోని యెరువాడ జైలులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడిన తీరుపై ఇంకా వివరాలు అందాల్సే ఉంది. అయితే, కసబ్ ఉరికి ముందు చివరి కోరిక ఏదీ కోరలేదని వార్తలు వస్తున్నాయి. కసబ్‌ను బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు ఉరితీసిన విషయం తెలిసిందే. తనకు ఏ కోరికా లేదని అతను జైలు అధికారులకు చెప్పాడని అంటున్నారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత కసబ్‌ను ఉరి తీసే ముందు అధికారులు జైలు మాన్యువల్‌ను పక్కాగా అనుసరించినట్లు తెలుస్తోంది. ఉరి తీసే ఉద్యోగి లేకపోవడంతో కసబ్‌ను యెరువాడ జైలులోని అధికారులే ఉరి వేసినట్లు తెలుస్తోంది.
యెరువాడ జైలులోని హ్యాంగ్‌మన్ కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేశాడు. దీంతో ఆ ఉద్యోగం ఖాళీగా ఉంది. దీంతో జైలు అధికారులే ఉరిశిక్షను అమలు చేయాల్సి వచ్చిందని అంటున్నారు. హ్యాంగ్‌మన్ మాత్రమే ఉరి వేయాలని చట్టం ఏదీ లేదని అధికారవర్గాలంటున్నాయి. ఉరి తీసిన తర్వాత అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యెరువాడ జైలులో 14 ఏళ్ల తర్వాత ఓ దోషిని ఉరి తీయడం ఇదే మొదటి సారి.












Click it and Unblock the Notifications