చిరు హోల్‌సేల్‌‌గా, బాబు రిటైల్‌గా...: విజయమ్మ

YS Vijayamma
మహబూబ్‌నగర్: తన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు తెలంగాణకు వ్యతిరేకం కాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పుల్లూరులో గురువారం సాయంత్రం ఏర్పాటైన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఆమె వెంట మాజీ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. తెలంగాణ అంటే వైయస్ రాజశేఖర రెడ్డికి ఎంతో ప్రేమ అని విజయమ్మ చెప్పారు

తెలంగాణ భావోద్వేగాలను అర్థం చేసుకోవాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ సెంటిమెంటును తాము సంపూర్ణంగా గౌరవిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆమె చెప్పారు. తెలంగాణలోని అలీసాగర్ - గుత్ప ప్రాజెక్టు వైయస్ హయాంలోనే పూర్తయిందని ఆమె అన్నారు. కల్వకుర్తి, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులకు వైయస్ శ్రీకారం చుట్టారని, వాటి పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు బాధేస్తోందని విజయమ్మ అన్నారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వైయస్ భావించారని, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులక వైయస్ 25 వేల కోట్ల రూపాయలు కేటాయించారని ఆమె చెప్పారు. ఉచిత విద్యుత్తు వల్ల లాభపడింది 70 శాతం తెలంగాణ రైతులేనని చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆమె అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాలనలో తినడానికి తిండి, తాగడానికి నీరు లేదని, రైతులకు కరెంట్ కూడా ఇవ్వలేదని, కరెంట్ చార్జీలను కట్టలేని రైతులను జైల్లో పెట్టారని ఆయన అన్నారు. రైతుల భార్యలను కూడా జైల్లో పెట్టించారని, ఇందుకు ప్రత్యేకమైన జీవోలను జారీ చేశారని ఆమె అన్నారు. పాదయాత్ర పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బాధ్యత నిర్వహించలేదని, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించడం లేదని విమర్శించారు.

చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ ప్రజల వద్దకు వస్తున్నారని ఆయన అన్నారు. తానే ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పారని, కనీసం రుణమాఫీ చేయించారా అని అన్నారు. ఉచిత విద్యుత్తు ఇస్తానని చంద్రబాబు ఈరోజు చెప్తున్నారని, వైయస్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవడానికి పనికి వస్తాయని చెప్పారని గుర్తు చేశారు. ఆ రోజు ఉచిత విద్యుత్తు ఎందుకు ఇవ్వలేదని అడిగారు.

వ్యవసాయ దండుగ అని, సంక్షేమ పథకాలు ప్రజలను సోమరులను చేస్తుందని చంద్రబాబు ఆ రోజు చెప్పారని, మద్యపాన నిషేధాన్ని ఎత్తేసింది చంద్రబాబు నాయుడేనని, చంద్రబాబు వల్లనే బెల్టు షాపులు ఇంత విరివిగా వచ్చాయని ఆయన అన్నారు. నీటి ప్రాజెక్టుల వల్ల నష్టమని చంద్రబాబు రాసుకున్నారని ఆయన అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం ధర పెంచిందీ, రైతుల కరెంట్ చార్జీలు పెంచిందీ చంద్రబాబేనని ఆయన అన్నారు. ఐటి, టూరిజం రంగాలను పెంచి సంపన్నులకే మేలు చేశారని విమర్శించారు. పేదల ప్రజలకు చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో ఒక్క మంచి కూడా జరగలేదని అన్నారు.

ఏ కోర్టు చంద్రబాబు నిర్దోషి అని చెప్పిందని విజయమ్మ అడిగారు. చంద్రబాబు ఆస్తులపై దర్యాప్తు చేయడానికి సిబిఐకి సిబ్బంది లేదని చెబుతున్నారని ఆమె అన్నారు. ఎవరు కేసులు వేసినా చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటారని, పైగా నీతిమంతుడ్ని అని చెప్పుకుంటారని అన్నారు. ప్రజలను ప్రభావితం చేస్తాడని ఉప ఎన్నికల సమయంలో వైయస్ జగన్‌ను విచారణకని పిలిచి జైల్లో పెట్టారని ఆమె అన్నారు.

కాంగ్రెసు పార్టీలో ఉండి ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పి, ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని ఆమె చెప్పారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎన్టీ రామారావును గద్దె దించి మానసిక క్షోభకు గురి చేశారని, మీడియాను మేనేజ్ చేసి పార్టీ చంద్రబాబుదని రాయించుకున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు మార్గదర్శకాలనే వైయస్ అనుసరించి భూములు ఇచ్చారని, చంద్రబాబు ఐఎంజికి తక్కువ ధరలకు భూములు ఇచ్చారని, ఎమ్మార్‌కు 535 ఎకరాలు తక్కువ ధరకు కట్టబెట్టారని ఆమె అన్నారు. కెజి బేసిన్ గ్యాస్‌కు మన ప్రభుత్వం టెండర్ వేయకపోతే గుజరాత్ నుంచి వచ్చి రిలయన్స్ టెండర్లు వేసిందని చెప్పారు.

నామా, రమేష్, రామోజీ రావు వంటివారికి చంద్రబాబు చేస్తే న్యాయం, వైయస్ చేస్తే తప్పట అని, మూలం చంద్రబాబు నాయుడేనని, మూలం నుంచి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అందరూ కుమ్మక్కయి కుట్ర చేసి జగన్‌ను జైలులో పెట్టించారని ఆమె అన్నారు. జగన్ కాంగ్రెసులో ఉండి వుంటే కేంద్ర మంత్రి అయి ఉండేవారని, ముఖ్యమంత్రి అయి ఉండేవారని గులాం నబీ ఆజాద్ అన్నారని విజయమ్మ గుర్తు చేశారు.

హోల్‌సేల్‌గా చిరంజీవి ప్రజారాజ్యాం పార్టీని అమ్ముకున్నారని, చంద్రబాబు రిటైల్‌గా పార్టీని అమ్ముకున్నారని విజయమ్మ అన్నారు. చంద్రబాబును ఎక్కడా ప్రజలు గెలిపించిన దాఖలాలు లేవని ఆమె అన్నారు. టన్నుల కొద్ది డబ్బులు ఇచ్చి జగన్ శాసనసభ్యులను కొంటున్నారని చంద్రబాబు అంటున్నారని, శానససభ్యులు చంద్రబాబుకు ఎలా కనిపిస్తున్నారని ఆమె అన్నారు. కాంగ్రెసు నుంచి తెలుగుదేశంలోకి ఎన్ని కోట్లు తీసుకుని చంద్రబాబు వచ్చారని, ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పుడు శాసనసభ్యులకు చంద్రబాబు ఎన్ని కోట్లు ఇచ్చారని ఆమె అడిగారు.

దశ, దిశ మారుస్తాడని జగన్‌ను నమ్మి నాయకులు వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తున్నారని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారని, చంద్రబాబు తనకు తాను నమ్మకంగా లేరని, నాయకులకు నమ్మకంగా లేరని, ప్రజలకు నమ్మకంగా లేరని ఆమె అన్నారు. వైయస్‌పై, జగన్‌పై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అందుకని చంద్రబాబు గురించి తాను ఇంతగా మాట్లాడాల్సి వచ్చిందని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+