షర్మిలకు గ్రీన్ సిగ్నల్: కెసిఆర్‌పై జగ్గారెడ్డి రివర్స్ గేర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కడప లోకసభ అభ్యర్థి ఓవైపు తేలిపోగా... మరోవైపు సంగారెడ్డి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) తెలంగాణపై రివర్స్ గేర్ వేసి ఒక్కసారిగా రాజకీయ వేడి పుట్టించారు. వైయస్ జగన్ సోదరి షర్మిల కడప స్థానంపై బాగా ఆశలు పెట్టుకున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

ఈ స్థానం పైన షర్మిలతో పాటు జగన్ బాబాయి వివేకానంద రెడ్డి, సోదరుడు అవినాష్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే కడప లోకసభ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని పార్టీ నేత ప్రకటించారు. దీంతో షర్మిల, వైయస్ వివేకానంద రెడ్డి ఆశలు నీరుగారిపోయాయనే చెప్పవచ్చు. అదే సమయంలో షర్మిలకు ఎక్కడి నుండి పోటీ చేసినా గెలిచే సత్తా ఉందని సదరు నేత ప్రకటించారు. అంటే షర్మిల రాజకీయ ఆరంగేట్రం 2014లో జరుగుతుందని చెప్పకనే చెప్పారు!
ఇన్నాళ్లూ తన సోదరుడు జగన్ జైలుకు వెళ్లడంతో షర్మిల ప్రత్యామ్నాయంగా మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారని, జగన్ బయటకు వచ్చాక ఆమె ఇంటికే పరిమితం అవుతారనే వ్యాఖ్యలు, అదే సమయంలో జగన్ బయటకు రాకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తే కడప స్థానం నుండి పోటీ చేసేందుకు షర్మిల ఆసక్తి చూపిస్తున్నరనే వాదనలు వచ్చాయి. అయితే చాలామంది నేతలు మాత్రం జగన్ బయటకు వస్తే షర్మిల ఇంటికే పరిమితం అవుతారని చెప్పారు.
కానీ నేటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వ్యాఖ్యలు మాత్రం షర్మిల రాజకీయ ఆరంగేట్రాన్ని తెలియజేస్తోంది. ఇన్నాళ్లూ జగన్ సోదరిగా ప్రచారంలో ముందుకు సాగిన షర్మిల మరి ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధపడతారో చూడాలి. తాను ఆశించిన కడప స్థానం నుండి తన మరో సోదరుడు అవినాష్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆమె తనకు అనుకూలమైన నియోజకవర్గం గురించి ఎన్నుకునే పనిలో పడతారని అంటున్నారు. పులివెందుల నుండి ఎలాగూ జగన్ పోటీ చేస్తారు. కాబట్టి షర్మిల జిల్లాలోనే మరో నియోజకవర్గాన్ని వెతుక్కునే అవకాశం ఉందంటున్నారు.
తెలంగాణ హీట్ పెంచిన జగ్గారెడ్డి
మరోవైపు జగ్గారెడ్డి ఆదివారం తెలంగాణ వద్దని సోనియా గాంధీకి చెబుతానని చెప్పి ఒక్కసారిగా రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో హీట్ పెంచాడు. ఇప్పటి వరకు తెలంగాణ నేతలు, పార్టీ అధినేతలు ఎవరూ తెలంగాణకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే టిజి వెంకటేష్, కావూరి, లగడపాటి వంటి కొందరు నేతలు తప్పితే ఎక్కువమంది సీమాంధ్ర నేతలు కూడా తెలంగాణ ప్రజల అభిప్రాయాల మేరకు తమ తమ పార్టీ నేతలు పోరాటం చేస్తున్నారని చెప్పేవారు.
అలాంటిది తెలంగాణ ప్రాంతానికి చెందిన జగ్గా రెడ్డి ఒక్కసారిగా తెలంగాణ వద్దని చెబుతానని, తెలంగాణ వస్తే లాభమేమి లేదని చెప్పడం గమనార్హం. 100 అసెంబ్లీ, 16 పార్లమెంటు స్థానాల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్న కెసిఆర్ అన్ని స్థానాల్లో మంచి స్థానాలు సాధిస్తే... కాంగ్రెసుతో కలవరని.. అలాంటప్పుడు తెలంగాణ ఇచ్చి లాభమేమిటనే ధోరణితో జగ్గారెడ్డి ఉన్నారని, అదే విషయాన్ని అధినేత్రికి చెబుతారని అంటున్నారు.
తెలంగాణ ఇవ్వలేమని చెబితే ఉండేవారు ఉంటారు.. వెళ్లేవారు వెళతారనే అభిప్రాయంలో జగ్గారెడ్డి ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. నిర్ణయం ఆయన అనుకున్నట్లుగా ఉంటే సీమాంధ్రలో కాంగ్రెసు బలం పెరుగుతుందని ఆయన భావిస్తుండవచ్చునని, అయితే తెలంగాణలో మాత్రం మరింత వీక్ కావడం ఖాయమంటున్నారు. మరోవైపు తెలంగాణలో సమైక్యాంధ్ర కోరుకునే వారితో పాటు కెసిఆర్‌ను దెబ్బతీయాలనుకునే వారు కూడా పరోక్షంగా మద్దతు పలికి తెరాసను బలహీనం చేసే ప్రయత్నాలు చేయవచ్చునని చెబుతున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనుక కొందరు ముఖ్యనేతల హస్తం ఉందా అనే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications