పురంధేశ్వరిపై షర్మిల పోటీ: విశాఖ లేదా ఒంగోలు?

కడప సీటును వైయస్ జగన్ తన బాబాయ్ కుమారుడు అవినాష్ రెడ్డికి ఇస్తానని హామీ ఇచ్చారు. మధ్యలో షర్మిల తగువుకు వచ్చినప్పటికి సమస్యను పరిష్కారం చేసి, అవినాష్ రెడ్డికే కడప లోకసభ సీటు ఇవ్వాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బడా నాయకులను దెబ్బ తీసే వ్యూహంలో భాగంగా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు పోటీకి దిగి అమీ తుమీ తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి లోకసభకు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం సీటును తనకు కేటాయించాలని టి. సుబ్బిరామిరెడ్డి పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. సుబ్బిరామిరెడ్డిని కాదని పురంధేశ్వరినే మళ్లీ అక్కడి నుంచి పోటీకి దింపితే షర్మిల ఆమెకు సవాల్ విసరడానికి సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ, సుబ్బిరామిరెడ్డికి కాంగ్రెసు అధిష్టానం విశాఖపట్నం సీటును కేటాయిస్తే పురంధేశ్వరికి ఒంగోలు సీటును కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అధిష్టానం ప్రత్యామ్నాయం చూపిస్తుందని అంటున్నారు. పురంధేశ్వరికి ఒంగోలు సీటును కేటాయిస్తే షర్మిల కూడా ఇక్కడికి మారుతారని తెలుస్తోంది.
ఒంగోలు శానససభా నియోజకవర్గానికి ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల ఒంగోలు లోకసభ సీటు షర్మిలకు మరింత అనుకూలంగా ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోనే వచ్చే అవకాశాలున్నాయనే భావనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది.












Click it and Unblock the Notifications