ఆజాద్ తెలంగాణ ప్రకటన: జగన్, బాబులకు రిలీఫ్

పార్టీల వైఖరిని స్పష్టంగా తెలుసుకోవడానికి కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం లేదని ఆజాద్ చెప్పేశారు. మరోవైపు, కాంగ్రెసు తన వైఖరిని అఖిల పక్ష సమావేశంలో చెప్పబోదని, ఇతర పార్టీల అభిప్రాయాలను మాత్రమే తెలుసుకుంటుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం మరింతగా స్పష్టత ఇచ్చారు. దీంతో తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి చంద్రబాబు, వైయస్ జగన్ వచ్చి ఉంటారు. దాంతో గాలి పీల్చుకుని ఉంటారు.
ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి వెల్లడించిన పార్టీలు కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు. దీంతో కాంగ్రెసు తన వైఖరిని స్పష్టం చేస్తూ ఇతర పార్టీల నుంచి ఒక్కో ప్రతినిధిని మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించి ఉంటే చంద్రబాబు, జగన్ స్పష్టంగా చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు కోరారు కాబట్టి ఆ సమావేశాన్ని బహిష్కరించే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీకి ఉండేది కాదు.
ఇకపోతే, తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని ఆయన గురువారంనాడే హైదరాబాదు వచ్చిన గులాం నబీ ఆజాద్‌ను కోరినట్లు తెలుస్తోంది. అందుకే, అఖిల పక్ష సమావేశం తేదీ కూడా పూర్తిగా ఖరారు కాలేదని ఆజాద్ అన్నారు. తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నందు వల్ల సమావేశాన్ని వాయిదా వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేపు శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సమావేశాన్ని వాయిదా వేయించేందుకు పార్టీ అధిష్టానం పెద్దల వద్ద ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications