చిక్కుల్లో బాబు: ముగ్గురు ఎంపిల డుమ్మాపై దుమారం

తెలుగుదేశం పార్టీకి ఐదుగురు రాజ్యసభ సభ్యులుండగా ఇద్దరు సభ్యులు హరికృష్ణ, సిఎం రమేష్ ఓటింగులో పాల్గొన్నారు. దేవేందర్ గౌడ్, గుండు సుధారాణి, సుజనా చౌదరి ఓటింగుకు దూరంగా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉన్న దేవేందర్ గౌడ్ ఆ తర్వాత వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి. తనకు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉండడంతో హాజరు కాలేదని దేవేందర్ గౌడ్ చెబుతున్నారు. గత కొంత కాలంగా దేవేందర్ గౌడ్ ఆరోగ్యం సరిగా లేదు.
కాగా, సుజనా చౌదరి, సుధారాణి ఏమయ్యారనేది, ఎందుకు వోటింగుకు దూరంగా ఉన్నారనేది తెలియడం లేదు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా ఓటేస్తామని దేవేందర్ గౌడ్ గురువారం చెప్పారు. కానీ, శుక్రవారం నాటికి దృశ్యం మారిపోయిందని అంటున్నారు. పార్లమెంటు సభ్యులు డుమ్మాపై చంద్రబాబు సమాధానం చెప్పాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభకు వోటింగు సమయంలో హాజరు కావద్దని చంద్రబాబు నాయుడే ఎంపిలకు సూచించారని ఆయన అంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఓ విధానమంటూ లేదని తెరాస నాయకుడు హరీశ్వర్ రెడ్ిడ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఎఫ్‌డిఐలపై జరిగిన ఓటింగులో తెలుగుదేశం సభ్యులు ఓటు వేయకపోవడం ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడమేనని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పరోక్షంగా చంద్రబాబే కాపాడుతున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని, అందుకే ఓటింగు నుంచి టిడిపి తప్పించుకుందని తెరాస శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయోమయంలో ఉన్నారని, చంద్రబాబు ఎటు పోతున్నారో కూడా ఆయనకే తెలియడం లేదని పోచారం వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెడుతోందని ఆయన విమర్శించారు.
ఎఫ్‌డిఐల విషయంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుకు పరోక్షంగా సహకరించిందని ఆయన అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఓటింగు సమయంలో రాజ్యసభకు గైర్హాజరయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. పొద్దున లేస్తే కాంగ్రెసును దుయ్యబట్టే చంద్రబాబు కాంగ్రెసును బలపరుస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని ఆయన అన్నారు.
కాగా, రాజ్యసభకు ముగ్గురు పార్లమెంటు సభ్యులు గైర్హాజరు కావడంపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, రాజ్యసభ సభ్యుల గైర్హాజరుపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్‌కు అనారోగ్యమైతే మిగతా ఇద్దరు సభ్యులు ఏమయ్యారని వారు అడుగుతున్నారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications