చంద్రబాబే అడ్డం పడ్డారు: పురంధేశ్వరి కయ్యం

Purandeswari
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వ్యవహారంపై కేంద్ర మంత్రి, ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తీవ్రంగాదుయ్యబట్టారు. ద్వంద్వ వైఖరి పాటించిన చంద్రబాబు తనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఎన్టీఆర్ అభిమానులకు శుక్రవారం ఒక బహిరంగ లేఖ రాశారు.

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కాకుండా అడ్డుపడుతోందని తానేనంటూ తెలుగుదేశం నాయకులు పదేపదే తనపై విమర్శలు చేశారని, వీటిని పట్టించుకోకుండా తనపని తాను చేశానని, విగ్రహావిష్కరణకు అవసరమైన అన్ని కార్యక్రమాలూ పూర్తి చేశానని అన్నారు. అయితే, ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు సంతోషించకుండా తనవల్లే ఆలస్యమైందంటూ విమర్శలు చేస్తుండటం తనను బాధించిందన్నారు.

ఇప్పటికైనా తాను స్పందించకపోతే వారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అంగీకరించినట్లే అవుతుందనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. నిజానికి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2000వ సంవత్సరంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేందుకు కమిటీ అంగీకరించి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని వెల్లడించారు. అయినప్పటికీ చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటుకు ఇవ్వలేదని, ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబే సమాధానం చెప్పాలని అన్నారు.

తాను లోకసభకు ఎన్నికైన తర్వాత సిఎంగా వైయస్ రాజశేఖరరెడ్డి స్పందించలేదని, మీడియా ద్వారా తెలుసుకుని విగ్రహం ఇచ్చే అవకాశాన్ని ఎన్టీఆర్ కుమార్తె అయిన తనకు ఇవ్వాల్సిందిగా కోరుతూ నాడు స్పీకర్‌గా ఉన్న సోమనాథ్ ఛటర్జీకి లేఖ రాశానని గుర్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు మేల్కొని, విగ్రహాల కమిటీ సభ్యుడిగా ఉన్న ఎర్రన్నాయుడి చేత లేఖ ఇప్పించారని, దీంతో తన లేఖను కమిటీ పరిగణలోకి తీసుకోలేదని వివరించారు.

ఈ విషయం తెలుసుకుని తాను స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరించాలంటూ ఆ బాధ్యతను ఎర్రన్నాయుడికి అప్పగించారని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవటంతో 2009 ఎన్నికల తర్వాత స్పీకర్ మీరాకుమార్‌కు మరోసారి ఈ విషయాలను విన్నవించానని తెలిపారు. దీంతో మళ్లీ చంద్రబాబు 2010లో తన సంతకం లేకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరి సంతకాలతో నామా నాగేశ్వరరావు ద్వారా స్పీకర్‌కు లేఖ పంపించారని అన్నారు.

అసలు ఇలా లేఖ రాస్తున్న సంగతి కూడా తనకు తెలియదని, తెలిస్తే తప్పకుండా సంతకం చేసేదాన్నని ఆమె తెలిపారు. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యుల్ని అడిగితే, తన సంతకం తీసుకోలేదన్న విషయం వారికి కూడా తెలియదని వారు చెప్పారని అన్నారు. కేవలం ప్రజల దృష్టిలో తనను దోషిగా నిలబెట్టడానికే చంద్రబాబు ఇదంతా చేశారని ఆరోపించారు.

చంద్రబాబు వైఖరి తెలియటం వల్లనే.. స్పీకర్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అనుమతి పత్రాలు తనకు సెప్టెంబరులోనే అందినప్పటికీ తాను వెంటనే ఆ విషయాన్ని బయటపెట్టలేదన్నారు. సోదరుల ఇళ్లకు తానే వెళ్లి త్వరలో జరగబోయే కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించానని తెలిపారు.

నమూనా విగ్రహాన్ని కూడా తయారు చేయించి, పార్లమెంటుకు తీసుకువచ్చి, సాంకేతిక కమిటీ ఆమోదం కూడా లభించిన తర్వాతే బయటకు వెల్లడించానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న కానీ, అంతకు ముందు కానీ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+