తెలంగాణ: చంద్రబాబు పైచేయి, వైయస్ జగన్ డైలమా

YS Jagan-Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పార్టీ ఆధిపత్యం సాధించినట్లే కనిపిస్తున్నారు. అధికార కాంగ్రెసు పార్టీని ఆయన ఇరకాటంలో పడేశారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశానికి తాము ఒక్క ప్రతినిధినే పంపుతామని చెప్పడం ద్వారా తమ వైఖరిని వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. పైగా, అఖిల పక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధినే ఆహ్వానించాలని చేసిన డిమాండ్‌ను పక్కన పెట్టి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించారు. దాంతో తెలంగాణ సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి కాంగ్రెసు పార్టీకి లేదని తెలుగుదేశం పార్టీ నిరూపించినట్లయింది.

తెలంగాణకు అనుకూలంగా గతంలో కన్నా గట్టిగా తెలుగుదేశం తెలంగాణ నాయకులు మాత్రమే కాకుండా చంద్రబాబు కూడా మాట్లాడుతున్నారు. ఎఫ్‌డిఐల అంశాన్ని పార్లమెంటులో పెట్టినప్పుడు తెలంగాణ బిల్లును ఎందుకు పెట్టరని కూడా ఆయన అడిగారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది అధికారంలో కాంగ్రెసు పార్టీ మాత్రమేనని పదే పదే తెలంగాణ ప్రాంతంలో జరుపుతున్న పాదయాత్రలో చెప్పడం ద్వారా కూడా చంద్రబాబు పైచేయి సాధించారని చెప్పవచ్చు.

సుశీల్ కుమార్ షిండే వివరణ

తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను సంతృప్తి పరచడానికి మాత్రమే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నారని కూడా తెలుగుదేశం పార్టీతో సహా ఇతర పార్టీలు విమర్శలు చేశాయి. ఈ స్థితిలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రత్యేక తెలంగాణపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఎంపీలను సంతృప్తి పరచడానికి మాత్రమే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నామనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని ఆయన సూచించారు.

తెలంగాణ ఏర్పాటే ఏకైక డిమాండ్: మోత్కుపల్లి

తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఓ తంతుగా మాత్రమే జరుగుతుందని ఆర్థం కావడంతో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు గొంతు పెంచారు. తెలంగాణ ఏర్పాటు తమ పార్టీ ఏకైక డిమాండ్ అని తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు, తెరాస చీకటి ఒప్పందం చేసుకున్నాయని, తెలంగాణపై కన్నా సీట్ల మీదనే తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌కు ఎక్కువ మక్కువ అని ఆయన అన్నారు.

మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెసు అఖిల పక్ష సమావేశం ద్వారా ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. అది తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకునే పద్ధతిని కాంగ్రెసు అనుసరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెరాస తప్ప అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఇవ్వాలని అడుగుతున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి తెలంగాణపై తమ పార్టీ ఒకడుగు ముందుకు వేసినట్లుగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రకంగా కాంగ్రెసు మీద పైచేయి సాధించడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోంది.

జగన్ పార్టీ మల్లగుల్లాలు

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అఖిల పక్ష సమావేశంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఏం చెప్పాలనే విషయంపై కూడా జగన్ పార్టీకి స్పష్టత రావడం లేదని అంటున్నారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఆగ్రహం తెప్పించే విధంగా వ్యవహరించడం ఎలాగో వారికి తెలియడం లేదని అంటున్నారు.

మరోవైపు, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే సీమాంధ్రలో ఊపు మీద ఉన్న తమ పార్టీ దెబ్బ తింటుందా అనే భయం కూడా పట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఏదో కారణం చెప్పి సమావేశాన్ని బహిష్కరించాలా అనే ఆలోచన కూడా సాగుతున్నట్లు సమాచారం. సమావేశాన్ని బహిష్కరించినా విమర్శలు తప్పేట్లు లేవు. అఖిల పక్ష సమావేశానికి ఎందరు ప్రతినిధులు వెళ్లినా ఒక్కో పార్టీ తెలంగాణపై ఒకే నిర్ణయం చెప్పాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. మొత్తం మీద వైయస్సార్ కాంగ్రెసు డైలమా నుంచి ఇంకా తేరుకున్నట్లు లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+