ఢిల్లీలో కిరణ్ బిజీ బిజీ: తెలంగాణ భేటీపై చుక్కెదురు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి గులాం నబీ ఆజాద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని కలిసే లోగానే ఆజాద్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమై నామినేటెడ్ పోస్టుల భర్తీకి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆజాద్‌తో భేటీ తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నందున తెలంగాణపై తలపెట్టిన భేటీని వాయిదా వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి సుశీల్ కుమార్ షిండేను కోరారు. అయితే, అందుకు కేంద్ర మంత్రి అంగీకరించలేదు. భేటీ వాయిదాకు గతంలో కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపించామని, అందువల్ల తెలంగాణపై భేటీని వాయిదా వేయడం కుదరదని సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ముఖ్యమంత్రిగా ఏమైనా చెప్పదలుదుచుకుంటే తర్వాత చెప్పవచ్చునని సుశీల్ కుమార్ షిండే కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. సమావేశాన్ని వాయిదా వేయాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరలేదని, ముఖ్యమంత్రిగా మీరే వాయిదా వేయాలని కోరుతున్నారని, అందువల్ల వాయిదా వేయడం కుదరదని ఆయన వివరించినట్లు సమాచారం.
ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. వీరిద్దరు కలిసి నామినేటెడ్ పోస్టులకు భర్తీ వ్యవహారంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారిద్దరు కలిసి ఆజాద్‌ను కలిశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆజాద్ వద్ద కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పర్వదిన లోపల నామినెటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవలి పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీన జరిగిన భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకోవడానికి ముందే గవర్నర్ నరసింహన్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications