దేవుడే తేల్చాలి, కానీ తేలాల్సిందే: తెలంగాణపై దానం

తెలంగాణ అంశంపై కేంద్రం ఆలస్యం చేయకుండా తేల్చడమే మంచిదని తన అభిప్రాయంగా చెప్పారు. రోజూ కీచులాటలు లేకుండా ఉండాలంటే కేంద్రం త్వరగా నిర్ణయాన్ని ప్రకటించడం శ్రేయస్కరమని మంత్రి చెప్పారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.
గురువారం సచివాలయంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జిహెచ్‌ఎంసి, ఆర్ అండ్ బి శాఖల మధ్య అధికారుల అవగాహన లోపంతో నిధులు ఉన్నా అభివృద్ధి జరగడం లేదన్నారు. హైదరాబాద్ మురికివాడల్లో ప్రస్తుతం ఆవాసాల్లో ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలు నిర్మించుకున్న ఇళ్ళును క్రమబద్ధీకరించుకోవాలని ఆయన సూచించారు. మురికివాడలు లేని నగరంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లక్ష్యమని ఆయన వివరించారు.
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకటించనంతవరకు అఖిలపక్ష సమావేశాల్లో ఆయా పార్టీల ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలకు విలువ ఉండదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్ అన్నారు. శుక్రవారం ఇక్కడ వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ నిర్ణయాలు రానంత వరకు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ప్రయోజనం ఏమిటన్నారు.
వివిధ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారని, కానీ కేంద్రం, కాంగ్రెస్ పార్టీల అభిప్రాయాలు రానంత వరకు ఎవరైనా ఏమని చెబుతారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వైఖరి అవలంభిస్తుందోనని తెలంగాణ ప్రజలు వేచిచూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications