బాబు మళ్లీ ఢోకా, జగన్ పార్టీ ఇంకా ఘోరం: కెసిఆర్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి టిడిపి కంటే ఘోరమన్నారు. నెల రోజుల పాటు విస్తృత కార్యాచరణ నిర్ణయించినట్లు చెప్పారు. తాను తెలంగాణ అంతటా పర్యటిస్తానని చెప్పారు. కేంద్రం తెలంగాణ ఇచ్చే అవకాశమే లేదన్నారు. కేంద్ర మండలి లేదా ప్యాకేజీ ఇవ్వవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. గడువు ముగిసిన తర్వాత లేదా కేంద్రం నిర్ణయం వెలువడిన తర్వాత అది తెలంగాణకు సానుకూలంగా లేకపోతే గులాబీ దళపతి స్వయంగా యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యేందుకు రెడీగా ఉంది.
కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత యాత్రపై పొలిట్ బ్యూరో మరోసారి చర్చించే అవకాశం ఉంది. కేంద్రం నిర్ణయం తెలంగాణకు సానుకూలంగా లేకపోతే, ఫిబ్రవరిలో కెసిఆర్ తన యాత్రను చేపట్టే వీలుందని పార్టీ వర్గాలు వివరించాయి. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందన్న నమ్మకం తనకు లేదని కెసిఆర్ చెప్పారు. కేంద్రం ఇచ్చిన నెల రోజుల హామీని నమ్మలేమని, ఆ తర్వాత ప్యాకేజీలనో, ప్రత్యేక ప్రతిపత్తి అనో చెప్పే అవకాశం ఉంటుందని చెప్పారు.
వాటికి అంగీకరించేది లేదని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రమే తమకు కావాలని స్పష్టం చేశారు. నెల రోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వడంలో కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. అవి మరోసారి నాటకమాడాయన్నారు. వాటి డిమాండ్‌లో ఎక్కడా తెలంగాణ పదం లేదన్నారు. అఖిలపక్షంతో వాటి రంగు తెలిసిందన్నారు.
జగన్ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని, దాని డిమాండ్‌లో ఎక్కడా తెలంగాణ ఇవ్వాలని లేదన్నారు. తండ్రిలాగ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమన్నారని విమర్శించారు. పైగా రాజ్యంగం, ఆర్టికల్ అని చెప్పారన్నారు. తెలంగాణ ఇస్తారన్న నమ్మకం తనకు లేదని, తొమ్మిదేళ్లుగా చూస్తున్నానని, తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలే నిర్ణయించుకోవాలన్నారు. టిడిపి వైఖరితో టిఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారని, స్పష్టత ఉన్న మా గుండెల్లో ఎందుకు రైళ్లు పరుగెడతాయని ప్రశ్నించారు.
మేమెందుకు డిఫెన్స్‌లో పడతామన్నారు. దొంగలు డిఫెన్స్‌లో పడతారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలన్న వాదనపైనా కెసిఆర్ మండిపడ్డారు. అయినా దేశానికి స్వాతంత్య్రాన్నిచ్చేందుకు లండన్‌లో అభిప్రాయం అడిగే ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు అడిగే కలిపారా అన్నారు. తెలంగాణ వారు దోపిడీకి గురవుతుంటే అడగాల్సింది అన్ని ప్రాంతాల ఏకాభిప్రాయం కాదన్నారు.
నెల రోజుల టిఆర్ఎస్ కార్యాచరణ
జనవరి 4న: ప్రతి మండలం నుంచి కనీసం 300 మోటారు సైకిళ్లతో నియోజకవర్గ కేంద్రానికి ర్యాలీలు. తెలంగాణవ్యాప్తంగా లక్ష
మోటారు సైకిళ్లతో ర్యాలీలు.
జనవరి 9న : నెలలోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అన్ని మండల కేంద్రాల్లో కాగడాల ప్రదర్శన.
జనవరి 17న: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 5000 మందితో సామూహిక దీక్షలు.
జనవరి 23న: జిల్లా కేంద్రాల్లో భారీ కవాతులు. కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు.
జనవరి 26న: అంబేద్కర్ విగ్రహాలకు వినతులు.
జనవరి 30న: మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో భారీ బహిరంగ సభ.












Click it and Unblock the Notifications