సోనియా గాంధీ కసరత్తు: తెలంగాణపై తేల్చేయడమే

అధిష్ఠానం పెద్దలతో జానా రెడ్డి చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. చర్చల సారాన్ని రహస్యంగా ఉంచే ఉద్దేశంతో జానా రెడ్డి మీడియాతో కూడా మాట్లాడలేదని అంటున్నారు. దీంతో ఆయనకు అధిష్టానం పెద్దల అపాయింట్‌మెంట్ దొరకలేదనే ప్రచారం జరిగిందని అంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంతాల సీనియర్ నేతలతో కాంగ్రెసు అధిష్టానం నాయకులు రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పినట్లు సమాచారం.
విభజన, ప్యాకేజీలు వంటి అంశాలపై, వాటి పర్యవసనాలపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని విభజిస్తే ఎలా ఉంటుందనే విషయంపై కూడా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. పార్టీకి ఏ రకంగా ప్రయోజనం జరుగుతుంది, దానివల్ల తలెత్తే పరిణామాలు ఏమిటనే విషయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో శనివారం రాత్రి బొత్స సత్యనారాయణ ఢిల్లీకి ప్రయాణం కట్టారు. ముఖ్యమంత్రి ఎల్లుండి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్తారని అంటున్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం మాటను పక్కన పెట్టి అటో ఇటో తేల్చేయాలనే పట్టుదలతోనే సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, లోకసభకు ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే ఎన్నికలు జరిపించాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ అంశాన్ని తేల్చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఏమైనా, కొద్ది రోజుల్లోనే తెలంగాణ అంశం తేలిపోనున్నట్లు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications