ఒకటికి పది పాక్ తలలు తేవాల్సిందే: కేంద్రానికి సుష్మా
న్యూఢిల్లీ: లాన్స్ హేమరాజ్ తలకు ప్రతిగా పది పాకిస్తానీ సైనికుల తలలు తీసుకు రావాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు. 13 రాజ్‌పుతానా రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు భారత జవాన్లను పాకిస్తాన్ సైనికులు నరికి వేసిన విషయం తెలిసిందే. దీనిపై సుష్మ స్పందిస్తూ.. ప్రతిగా పది పాకిస్తాన్ సైనికుల తలలు కావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన తర్వాత కూడా కేంద్రం బుజ్జగింపు చర్యలు సరికావన్నారు.
మానవత్వం లేకుండా సైనికుల తలలు నరికిన పాకిస్తాన్ పైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలని ఆమె సోమవారం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేంద్రం అంతే తీవ్రంగా స్పందించాలని సూచించారు. పాకిస్తాన్ తలలు నరికి దారుణానికి ఒడిగట్టడమే కాకుండా ఒకరి తలను ఇవ్వలేదని.. అందుకు ప్రతిగా పది పాకిస్తాన్ తలలు తీసుకు రావాలన్నారు. హేమరాజ్ తలను పాకిస్తాన్ ఇవ్వకుంటే మనం తప్పకుండా అటు నుండి పది తలలు తీసుకు రావాలన్నారు.
సోమవారం ఆమె పార్టీ నేతలు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి హేమరాజ్ కుటుంబాన్ని పరామర్శించారు. పాక్ దుశ్చర్యల పట్ల మనం చేతులు ముడుచుకు కూర్చుంటే లాభం లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలన్నారు. కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇద్దరు జవాన్ల తలల నరికివేతను దేశ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. కేంద్రం ఏమీ చేయలేదని ప్రభుత్వంగా నిరూపించుకోవద్దని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

పాకిస్తాన్ చర్య ఎట్టి పరిస్థితుల్లో సహించేది కాదన్నారు. దీనిపై ఓపికపట్టడం సరికాదన్నారు. జవాన్ల మృతి పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న ఉదాసీనతకు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అమర జవాన్ల కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ పైన ప్రతికారం తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications