వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇష్యూ: కిరణ్ రెడ్డి ప్రభుత్వానికి ఎసరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశం అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎసరు పెట్టే విధంగా ఉందనే ప్రచారం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, వ్యతిరేకంగా తీసుకున్నా కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందనే అంచనాలు సాగుతున్నాయి. బొటాబొటీ మెజారిటీ ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఈ స్థితిలో తెలంగాణ అంశంపై కేంద్రం కచ్చితమైన నిర్ణయం తీసుకుని ప్రకటస్తే అధికార పార్టీకి చెందిన తెలంగాణ శానససభ్యులో, సీమాంధ్ర శాసనసభ్యులో కొద్దిమంది రాజీనామా చేసిన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని అంటున్నారు.

అయితే, కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై కన్నా కేంద్రంలో అధికారంలోకి రావడంపైనే ఎక్కువ దృష్టి పెట్టి తెలంగాణ అంశాన్ని తేల్చే ఉద్దేశంతో ఉంది. అందుకే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. సీమాంధ్రలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని, కాంగ్రెసుకు నామమాత్రం సీట్లు కూడా దక్కే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

సీమాంధ్రలో ఓటమి తప్పని స్థితి ఉంటే, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతంలోనైనా మెజారిటీ సీట్లు సాధించుకుంటే పోలా అనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే తెలంగాణలో తమ పార్టీకి కనీసం 15 లోకసభ స్థానాలను గెలిపించి ఇస్తామని కాంగ్రెసు తెలంగాణ నాయకులు హామీ ఇస్తున్నారు. ఒకవేళ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని అంటున్నారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ తెలంగాణపై నిర్ణయం విషయంలో వెనకాడకూడదని కాంగ్రెసు అధిష్టానం ప్రస్తుత ఆలోచనగా చెబుతున్నారు. సెప్టెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కూడా కాంగ్రెసు అధిష్టానంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. దానివల్ల రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయినా పెద్దగా నష్టం లేదనే భావనతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం శానససభ బలాబలాలను అంచనా వేస్తే పడిపోయే స్థితిలోనే ఉంది.

మొత్తం 294 స్థానాలున్న శానససభలో పాలక కాంగ్రెసు పార్టీ బలం 155 మంది సభ్యులు. స్వతంత్ర సభ్యుడు కూన శ్రీశైలం కూడా కాంగ్రెసుకు మద్దతు ఇస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెసుకు దూరమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. కాంగ్రెసు శాసనసభ్యుల్లో సుజయకృష్ణ రంగారావు (బొబ్బిలి), ఆళ్ల నాని (ఏలూరు), ఎం. రాజేష్ కుమార్ (చింతలపూడి) రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగులో ఉన్నాయి. మరో ఇద్దరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి (దర్శి) కూడా కాంగ్రెసుకు రాజీనామా చేసి వైయస్ జగన్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ఆరుగురిని తీసేస్తే కాంగ్రెసు సభ్యుల సంఖ్య 150 మాత్రమే ఉంటుంది.

అంతకు ముందు ఏడుగురు సభ్యులున్న మజ్లీస్ కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. తాజా పరిస్థితి చూస్తే కనీస మెజారిటీ 148కి రెండు స్థానాలు ఎక్కువ కాంగ్రెసుకు ఉన్నాయి. ప్రతిపక్షాల్లో తెలుగుదేశం పార్టీకి 86 మంది శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలకు చెరో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మజ్లీస్‌కు ఏడుగురు, సిపిఐకి నలుగురు, బిజెపికి ముగ్గురు ఉన్నారు. సిపిఎం, లోకసత్తా సభ్యులు ఒక్కొక్కరు ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి, కూన శ్రీశైలం, సోమవారం సత్యనారాయణ ఇండిపెండెంట్లుగా ఉన్నారు. ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి మధ్య తేడా కేవలం ఆరుగురు శాసనసభ్యులే. మరో నలుగురు సభ్యులు కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకుంటే కిరణ్ ప్రభుత్వం చిక్కుల్లో పడడం ఖాయం.

తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు కొంత మంది శానససభ్యులు చెబుతున్నారు. అలా రాజీనామాల వరద పారితే కచ్చితంగా ప్రభుత్వం పతనమవుతుందని అంటున్నారు. అయితే, అటువంటి పరిస్థితి వస్తే తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని తెరాస శానససభ్యుడు హరీష్ రావు చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన సభ్యులు కూడా రాజీనామాలు చేసే అవకాశాలున్నాయి. అప్పుడు లెక్కలు ఎటు తిరిగి ఎటు పోతాయో తేలదు. మొత్తంగా ఒక అయోమయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

English summary
According to political experts - CM Liran kumar Reddy's government is in trouble with ongoing Telanagana tussle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X