కన్నకొడుకు ముందే భార్యపై రాడ్లు, స్క్రూ డ్రైవర్ తో దాడిచేసి చంపిన భర్త!
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో భార్యాభర్తల మధ్య నెలకొన్న అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్నపిల్లల ముందే తండ్రి కన్నతల్లిని కిరాతకంగా హతమార్చిన హృదయవిదారక ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వీనీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అవినాష్, కోమలి దంపతులకు ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.
అపార్ట్ మెంట్ లో పని చేసే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త
దాదాపు ఆరు నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు అవినాష్, కోమలి దంపతులు.. తేజస్విని నగర్ లోని ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా చేరింది. భర్త అవినాష్ ఆటో నడుపుతుండగా, భార్య కోమలి అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే పలువురి ఇళ్లలో పనులకు వెళ్లేది. అయితే, పనులు ముగించుకుని ఇంటికి రావడానికి ఆలస్యమవుతోందనే కారణంతో కోమలి ప్రవర్తనపై అవినాష్ అనుమానం పెంచుకున్నాడు.

అమ్మను చంపొద్దు అని వేడుకున్నా వినని కసాయి
ఈ విషయమై గత కొద్దిరోజులుగా వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అవినాష్ భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ వివాదం ముదరడంతో ఆగ్రహానికి గురైన అవినాష్ కత్తితో కోమలిపై దాడికి యత్నించాడు. అది చూసిన పెద్ద కుమారుడు భయంతో.. "అమ్మను చంపొద్దు నాన్నా" అంటూ తండ్రిని వేడుకున్నా వదిలిపెట్టలేదు
రాడ్ , స్క్రూడ్రైవర్ తో భార్యపై విచక్షణా రహితంగా దాడి
భర్త బారి నుంచి తప్పించుకునేందుకు కోమలి గట్టిగా కేకలు వేస్తూ అపార్ట్‌మెంట్ వెలుపలికి పరుగులు తీసింది. అవినాష్ ఆమెను వెంబడించాడు. ఆ సమయంలో చేతిలోని కత్తి జారిపోవడంతో, పక్కనే ఉన్న స్క్రూడ్రైవర్ మరియు రాడ్డుతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ఆర్తనాదాలు విని స్థానికులు అక్కడికి చేరుకునేసరికి నిందితుడు పరారయ్యాడు.
కోమలి మృతి, కటకటాల పాలైన భర్త, అనాధలైన పిల్లలు
తీవ్ర రక్తస్రావమైన కోమలిని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతో భార్యను హతమార్చిన భర్త కటకటాల పాలు కాగా, అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.













Click it and Unblock the Notifications