వాస్తు ప్రకారం మెట్లపై కూర్చోకూడదు.. ఎందుకంటే?
మన ఇళ్లలో లేదా అపార్ట్‌మెంట్‌లలో చాలామందికి మెట్లపై కూర్చోవడం, అక్కడ కూర్చుని ఫోన్ మాట్లాడటం లేదా కాసేపు కాలక్షేపం చేయడం అలవాటుగా ఉంటుంది. చూడటానికి ఇది చాలా సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, దీని వెనుక పెద్ద వాస్తు దోషం దాగుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలిసో తెలియకో మనం చేసే ఈ చిన్న పొరపాటు వల్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకుందాం.
సహజంగా సాయంత్రం వేళల్లోనో, లేదా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడో ప్రశాంతంగా ఉంటుందని చాలామంది మెట్ల వైపు అడుగులు వేస్తారు. అక్కడ కూర్చుని గంటల తరబడి సమయాన్ని గడిపేస్తుంటారు. అయితే, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మెట్లపై అలా కూర్చోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మెట్లు అనేవి కేవలం పైకి, కిందికి నడవడానికి మాత్రమే కాదు... అవి ఇంట్లోకి వచ్చే అదృష్టానికి, శక్తుల ప్రవాహానికి ప్రధాన మార్గాలు.

కంటికి కనిపించని 'నెగటివ్ ఎనర్జీ'
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని సానుకూల, ప్రతికూల శక్తులు సంచరించే ముఖ్యమైన రహదారి మెట్లు. మెట్లను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచినప్పుడే ఇంట్లోకి మంచి శక్తులు ప్రవహిస్తాయి. మనం మెట్లపై ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పేరుకుపోయి, అశాంతి వాతావరణం ఏర్పడుతుంది.
శని, రాహువుల ఆగ్రహం!
జ్యోతిష్య శాస్త్ర కోణంలో చూస్తే.. ఇంటి మెట్లు అనేవి శని దేవుడు, రాహు గ్రహాల ప్రభావంతో ముడిపడి ఉంటాయి. మెట్లపై అనవసరంగా కూర్చోవడం వల్ల జాతకంలో శని, రాహువుల దోషాలు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా జీవితంలో అనవసరమైన ఆటంకాలు, మానసిక ఒత్తిడి, టెన్షన్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది.
ఆర్థిక ఎదుగుదలకు బ్రేకులు
మెట్లు ఎక్కడం అనేది జీవితంలో మనం సాధించే అభివృద్ధికి, పురోగతికి ప్రతీక. ఎదగడానికి సంకేతమైన ఆ మెట్లపైనే మనం కూర్చుని ఉండిపోతే.. మన ఆర్థిక ఎదుగుదల కూడా అక్కడికక్కడే ఆగిపోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం, చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడం, ఊహించని ఖర్చులు రావడం వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్య సమస్యలు - ప్రమాదాలు
ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు.. దీని వెనుక సైన్స్, సామాజిక బాధ్యత కూడా ఉన్నాయి. మెట్లు అనేవి ఎప్పుడూ రాకపోకలు సాగించే ప్రదేశం. అక్కడ కూర్చోవడం వల్ల నడిచేవారికి ఇబ్బంది కలగడమే కాకుండా.. పొరపాటున కాలు జారితే పిల్లలు, వృద్ధులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, కాళ్లకు ఉండే దుమ్ము, మురికి ఎక్కువగా మెట్లపైనే చేరుతుంది. అక్కడ కూర్చోవడం వల్ల అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications