ఈడీ కేసులో రామ్ చరణ్‌కు బిగ్ షాక్..! పీఎంఎల్ఏ కోర్టులోకి బంతి..!
హైదరాబాద్ మణికొండలోని ఎమ్మార్ ప్రాపర్టీస్ (Emaar Properties) కు చెందిన బౌల్డర్ హిల్స్ (Boulder Hills) విల్లాల కొనుగోలు వ్యవహారంలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ (Ram Charan) కు షాక్ తప్పలేదు. బౌల్డర్ హిల్స్ విల్లాల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రామ్ చరణ్ తో పాటు ఆంధ్రా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి చాముండేశ్వరీనాథ్, మరో ఇద్దరు కొనుగోలు చేసిన ఫ్లాట్లను అటాచ్ చేసింది. వీటిని విడుదల చేయాలని ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన వీరికి.. ఊరట లభించలేదు.
బౌల్డర్ హిల్స్ లో రామ్ చరణ్ రూ.3.86 కోట్లతో విల్లా కొనుగోలు చేయగా.. చాముండేశ్వరీ నాథ్ రూ.3.64 కోట్లతో కొనుగోలు చేశారు. మరో ఇద్దరి విల్లాలు కూడా కలిపి మొత్తం రూ.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ ఇప్పటికే కోర్టు ఆదేశాలతో అటాచ్ చేసింది. వీటిని విడుదల చేయాలంటూ వీరు ప్రత్యేక అప్పిలేట్ ట్రైబ్యునల్ (SAFEMA)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ట్రైబ్యునల్.. తాము అమాయక కొనుగోలుదారులమేనని నిరూపించుకునేందుకు ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టును ఆశ్రయించాలని తేల్చిచెప్పేసింది. కొనుగోలుదారుల వాదనలు ప్రాథమికంగా బలంగా ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ, వారు నిజమైన కొనుగోలుదారులా లేక నిందితులతో కుమ్మక్కయ్యారా అనేది ప్రస్తుతం తేల్చలేమని ట్రైబ్యునల్ పేర్కొంది.

ఈడీ జరిపిన విచారణ ఆధారంగా కొనుగోలుదారులు మోసపోయారని భావిస్తే, వారి ప్లాట్లను విడుదల చేసే అంశాన్ని ప్రత్యేక కోర్టు పరిశీలిస్తుందని తెలిపింది. ట్రయల్ పూర్తయిన తర్వాతే దీనిపై కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. మణికొండలో 535 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే ప్రాజెక్టులో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే నేరుగా ప్లాట్లను విక్రయించారని ఈడీ ఆరోపిస్తోంది. అలాగే, ఈ లావాదేవీలకు సంబంధించి భారీగా అనధికారిక నిధులు వసూలు చేశారని, ఆ మొత్తాన్ని ఏపీఐఐసీతో పంచుకోలేదని చెబుతోంది. తాము చట్టబద్ధమైన నిధులతో 95 శాతం చెల్లింపులు చేశామని, కానీ అప్పటి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం వల్లే ఇబ్బంది పడ్డామని కొనుగోలుదారులు వాదిస్తున్నారు. చివరకు ప్రత్యేక కోర్టు ఈ కొనుగోలుదారులను నిజమైన బాధితులుగా గుర్తిస్తే, మిగిలిన మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసి సేల్ డీడ్స్ పూర్తి చేసుకునేందుకు అనుమతించవచ్చని ట్రైబ్యునల్ తెలిపింది.




Click it and Unblock the Notifications