జగన్ పార్టీలోకి వెళ్లేవారే, చిరంజీవి మౌనమేల: పొన్నం

గంటా శ్రీనివాస రావు విమర్శలకు చిరంజీవి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గంటా శ్రీనివాస రావుకు తెలుగుదేశం రంగు పూర్తిగా పోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేస్తామని అంటున్న సీమాంధ్ర నాయకులంతా రేపో మాపో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేవారేనని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు సిట్టింగ్ సీట్లను ఉప ఎన్నికల్లో కోల్పోలేదని, కాంగ్రెసు సిట్టింగ్ సీట్లు కోల్పోయింది ఆంధ్ర ప్రాంతంలోనే అని, దీనికి ఆంధ్ర నాయకులు ఏం చెబుతారని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం లగడపాటి రాజగోపాల్ ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలుగు భాష గురించి మాట్లాడుతున్నవారు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు.
తమ సహనాన్ని అసమర్థతగా భావించవద్దని ఆయన అన్నారు. తొందరపడవద్దని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడం వల్లనే తాము ఓపిక పట్టామని ఆయన చెప్పారు. తెలంగాణ వస్తే ఆంధ్ర ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. హైదరాబాదుపై రెఫరెండం అవసరం లేదని, అవగాహన లేనివారే రెఫరెండం గురించి మాట్లాడుతున్నారని, హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని పొన్నం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డుకోవద్దని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు చెప్పినట్లు తమ పార్టీ శానససభ్యుడు జగ్గారెడ్డి నడుచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 28వ తేదీ లోపు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే భారత్‌ను ప్రజాస్వామ్యదేశంగా అంగీకరించడం పొరపాటేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications