కెసిఆర్! ఎక్కడ దాక్కున్నావ్, ప్రగల్భాలా?: లగడపాటి

హైదరాబాదులో ఎక్కడైనా తనతో పోటీకి సిద్ధమా అన్న తన సవాల్‌కు స్పందించే ధైర్యం లేక కెసిఆర్ ఎక్కడో దాక్కున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. దుర్యోధనుడి మాదిరిగా నీటి మడుగులో దాక్కున్నావా!? మీ పరిస్థితికి ఇది అద్దం పడుతోందని నిప్పులు చెరిగారు. తెలంగాణవాదం వయలెంట్‌గా ఉంటే సమైక్యవాద శక్తి సైలెంట్‌గా ఉంటుందని, దీనిని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దన్నారు. హైదరాబాద్ తెలుగు తల్లి సొత్తే అన్నారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఎవరు ప్రయత్నించినా తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో మనం.. మన ప్రజల ప్రయోజనాలపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన ఉద్యోగుల సదస్సుకు లగడపాటి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా 270 స్థానాలను సమైక్యవాద పార్టీలే గెలుచుకుంటాయన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఒక్క అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా ధైర్యం చేయలేని కెసిఆర్.. మహా భారత యుద్ధంలో దుర్యోధనుడు నీటి మడుగులో దాక్కున్న విధంగా పారిపోయాడని ఎద్దేవా చేశారు.
దీంతో దుర్యోధనుడికి ధర్మరాజు సవాల్ విసిరాడని, నీటిలోంచి బయటకు వచ్చి పాండువులలో ఎవరో ఒకరితో యుద్ధం చేయాలని సవాల్ విసిరాడని గుర్తు చేశారు. అలాగే, తాను కూడా కెసిఆర్‌ని హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయాలని, ప్రత్యర్థిగా తానే పోటీ చేస్తానని సవాల్ విసిరినా ఎలాంటి ప్రతి స్పందన లేదన్నారు. ప్రస్తుతం తెలుగు తల్లిని 294 అంతస్తుల భవనంపై నుంచి వేలాడదీసి ఉంచారు.
కొందరు పైకి, మరికొందరు కిందికి లాగాలని చూస్తున్నారు. గతంలో తెలుగు తల్లిని పైకిలాగే వారి సంఖ్య 225 ఉండేది. టిడిపితెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో 90 మంది జారిపోయారు. ఇప్పుడు తెలుగు తల్లిని కిందకు లాగే వారి సంఖ్య 165కు పెరిగితే... పైకి లాగే వారి సంఖ్య 135కి పడిపోయిందన్నారు. ఇలా లాగే వారంతా రాష్ట్ర ఎమ్మెల్యేలన్నారు. చంద్రబాబు లేఖతోనే సమైక్యవాదం మైనార్టీలో పడిందన్నారు.
ఆయనకు కనువిప్పు కలిగించడానికే ఈనెల 21న కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి తరుణంలో సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ధైర్యంగా ముందుకు వచ్చారని, వారిని అభినందిస్తున్నానని అన్నారు. ఈ నెల 18న ఎన్జీవోల సమావేశ నిర్ణయాలతో మొదలైన చిన్న కేక తెలంగాణ నాయకుల గుండెల్లో కెవ్వు కేకగా మారిందన్నారు. సమైక్యవాదానికి అనుకూలంగా ప్రారంభమైన ఉద్యమాన్ని చూసి కొందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications