గగన వీధిలో వినూత్న ఘట్టం.. ప్రపంచ రికార్డు తిరగరాసిన విమానం..

ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని వినూత్న ఘట్టం ఆవిష్కృతమైంది. ల్యాండింగ్ కోసం ఎక్కడా ఆగకుండా, గాల్లోనే ఏకంగా 24 గంటలకు పైగా ప్రయాణించి ఒకే విమానం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ప్రముఖ క్వాంటాస్ (Qantas) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానం ఈ అసాధ్యమైన రికార్డును సాధించి గ్లోబల్ ఏవియేషన్ రంగం దృష్టిని తనవైపు తిప్పుకుంది. భవిష్యత్తులో సుదీర్ఘ దూర ప్రాంతాలకు ఎలాంటి స్టాప్‌ఓవర్లు లేకుండా నేరుగా విమానాలను నడిపేందుకు చేపట్టిన 'ప్రాజెక్ట్ సన్‌రైజ్'లో ఈ ప్రయోగం ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.

23 వేల కిలోమీటర్లు.. 24 గంటల సుదీర్ఘ ప్రయాణం!

మెల్‌బోర్న్ వేదికగా బయలుదేరిన ఈ ప్రత్యేక 'ఎయిర్‌బస్ A350' విమానం పసిఫిక్ మహాసముద్రం, అమెరికా, కెనడా, అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేసింది. చివరికి ఫ్రాన్స్‌లోని తులూస్ నగరం చేరుకునే సమయానికి ఈ విమానం ఆకాశంలో గడిపిన సమయం ఏకంగా 24 గంటల 23 నిమిషాలు. ఈ ప్రయాణంలో విమానం దాదాపు 23,075 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గాల్లోనే సరికొత్త చరిత్ర లిఖించింది. 2005లో హాంకాంగ్ నుంచి లండన్ మధ్య నమోదైన 22 గంటల 42 నిమిషాల పాత రికార్డును ఇది తిరగరాసింది.

Qantas Project Sunrise Breakthrough Special Airbus A350 Flies Nonstop For Over 24 Hours to France

లక్షలాది మంది కళ్లప్పగించి చూసిన ఆకాశ విన్యాసం!

ఈ చారిత్రాత్మక విమాన ప్రయాణం గ్లోబల్ లెవల్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. విమానాల రాకపోకలను పర్యవేక్షించే లైవ్ ట్రాకింగ్ యాప్‌లలో ఏకంగా 36 లక్షల మందికి పైగా నెటిజన్లు ఈ ఫ్లైట్ రూట్‌ను నిరంతరం పర్యవేక్షించారు. ఒకానొక దశలో ఏకంగా 1.2 లక్షల మంది ప్రత్యక్షంగా లైవ్‌లో ఈ ల్యాండింగ్ దృశ్యాలను వీక్షించడం విశేషం. ఏవియేషన్ చరిత్రలో అత్యంత ఎక్కువ మంది ట్రాక్ చేసిన రెండో విమానంగా ఇది నిలిచింది. ప్రయోగాత్మకంగా సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో టెస్టింగ్ సిబ్బంది, ఇంజనీర్లు , పైలట్లతో కలిపి మొత్తం 12 మంది పాల్గొన్నారు.

ప్రత్యేక ఇంధన ట్యాంక్.. ముందస్తు కసరత్తులు

ఇంత పెద్ద సుదీర్ఘ ప్రయాణాన్ని సాకారం చేయడం కోసం విమాన నిర్మాణంలో పలు మార్పులు చేశారు. సుమారు 20 వేల లీటర్ల అదనపు ఇంధనాన్ని నిల్వ చేసుకునేలా ప్రత్యేక ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు. గాల్లో సుదీర్ఘ సమయం గడిపేటప్పుడు విమానంలో శబ్దాల తీవ్రత, గాలి ప్రసరణ, ఇంజన్ పనితీరును పరిశీలించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. వారం రోజుల క్రితమే ఇదే విమానం తులూస్ నుంచి మెల్‌బోర్న్ వరకు 19 గంటల పాటు ప్రయాణించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

2027 నాటికి నాన్‌స్టాప్ విమానాలు!

క్వాంటాస్ సంస్థ ప్రణాళిక రూపొందిస్తున్న 'ప్రాజెక్ట్ సన్‌రైజ్' ఆస్ట్రేలియా నుంచి లండన్, న్యూయార్క్ నగరాలకు నేరుగా (నాన్‌స్టాప్) సర్వీసులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఇప్పటికే 12 ప్రత్యేక విమానాలకు ఆర్డర్లు కూడా ఇచ్చారు. 2027 నాటికి ఈ కమర్షియల్ సేవలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా నుంచి లండన్ వెళ్లడానికి ఐదు రోజుల సమయం పట్టగా.. రాబోయే రోజుల్లో ఎలాంటి బ్రేక్ లేకుండా కేవలం 19 నుంచి 21 గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని ఏవియేషన్ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+