పిక్చర్స్: తెలంగాణపై ఆ ముగ్గురే, అటూ ఇటూ
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్రం నిర్ణయం ప్రకటించే గడువు దగ్గర పడుతున్న కొద్దీ హస్తిన రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర నాయకులు అధిష్టానం పెద్దలను కలుస్తూ తమ తమ వాదలను వినిపిస్తుండడంతో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. సీమాంధ్ర నాయకులు పెద్ద యెత్తున ఢిల్లీ చేరుకుని సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవితోనూ, ఎఐసిసి నాయకుడు దిగ్విజయ్ సింగ్‌తోనూ సమావేశమయ్యారు. రేపు మంగళవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వీరు తమ వాదనను ఎఐసిసి పెద్దల ముందుంచారు.
కాగా, తెలంగాణ నేతలు కూడా అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. సోమవారం వారు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమనే ధీమాను తెలంగాణ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణ అంశానికి సంబంధించి అధిష్టానం పెద్దల్లో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి కేంద్ర బిందువులుగా మారారు.
తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఆ ముగ్గురు నేతలను కలుసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోందని గతంలో ప్రకటించిన సీమాంధ్ర నేతలు సోమవారం సుశీల్ కుమార్ షిండేను కలిసిన తర్వాత తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆ విషయాన్ని సుశీల్ కుమార్ షిండే తమకు తెలిపినట్లు వారు చెప్పారు. వారు సోమవారం కాస్తా ఆనందంగా కనిపించారు. అయితే, తెలంగాణపై ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నామనే విషయంపై మాత్రం ఆజాద్, రవి, షిండే ఏ విధమైన సంకేతాలు ఇవ్వడం లేదు. విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని ఎపిఎన్జీవోల సంఘం నాయకులు ప్రకటించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర నాయకులు కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను పలుమార్లు కలిశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ నాయకులు ఆజాద్‌ను చాలాసార్లు కలిశారు.

ఎఐసిసి రాష్ట్ర పరిశీలకుడు వాయలార్ రవి కూడా తెలంగాణ సమస్యపై ముఖ్యమైన నేతగా మారారు. ఇటు తెలంగాణ నాయకులు, సీమాంధ్ర నాయకులు ఆయనను కలిసి తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. వారి వాదలను ఆయన వింటూ ఉన్నారు గానీ ఏం చేయబోతున్నామనే విషయాన్ని చెప్పడం లేదు.

రాష్ట్ర విభజన అనేది హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పరిధిలోకి వస్తుంది. దీంతో తెలంగాణ జెఎసి నాయకులు సుశీల్ కుమార్ షిండేను కలిసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఎట్టకేలకు తెలంగాణ అంశంపై సుశీల్ కుమార్ షిండే ఇటీవల అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అఖిల పక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కెసిఆర్, నాయని నర్సింహారెడ్డికి ఇలా స్వాగతం చెప్పారు.

తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణీత సమయం ఇచ్చి అన్ని పార్టీలకు చెందిన ఇద్దరేసి ప్రతినిధుల వాదనలను సుశీల్ కుమార్ షిండే విని నెలలోగా నిర్ణయం వెల్లడిస్తామని డిసెంబర్ 28వ తేదీన సమావేశానంతరం చెప్పారు.
కాగా, తెలంగాణపై ఈ నెల 25వ తేదీననే హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. విభజనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ హైదరాబాదును ఏం చేస్తారనే విషయం ఇంకా తేల్చలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన జరిగే కోర్ కమిటీ సమావేశంలో కచ్చితమైన నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తారని అంటున్నారు. మొత్తం మీద గడువు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications